Urban Challenge Fund Telangana: వర్షాకాలం వస్తే చాలు వరంగల్ వణికిపోతుంది… వీధుల్లో డ్రైనేజీ నీరు పొంగిపొర్లి ప్రజలు నరకయాతన అనుభవిస్తుంటారు. మరోవైపు ట్రాఫిక్ పర్యవేక్షణ లేమితో ఖమ్మం నగరం, మౌలిక సదుపాయాల కొరతతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. ఎప్పటికైనా తమ నగరాల రూపురేఖలు మారవా అని ఎదురుచూస్తున్న ఆయా ప్రాంతాల ప్రజలకు ఇప్పుడు ఒక అద్భుతమైన శుభవార్త అందింది. ఈ మూడు మహానగరాల మహా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.5,681 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ పచ్చజెండా ఊపింది.
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) కింద నిధుల వరద : నగరాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ (యూసీఎఫ్) ఇప్పుడు తెలంగాణ పాలిట వరప్రదాయినిగా మారింది. దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేయగా, అందులో మూడు ప్రాజెక్టులు తెలంగాణకే దక్కడం విశేషం. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ గ్రోత్ కారిడార్‌తో పాటు పలు అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ.5,681.04 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదం పొందాయి.
నిధుల సమీకరణ ఇలా: ఈ ప్రాజెక్టులకయ్యే మొత్తం ఖర్చులో 50 శాతం నిధులను హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో – HUDCO) రుణంగా సమకూరుస్తుంది. మిగిలిన 50 శాతం నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం (అంటే 25:25 నిష్పత్తిలో) భరించనున్నాయి. ఈ మేరకు అధికారిక లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పంపింది.
వరంగల్ డ్రైనేజీ కష్టాలకు శాశ్వత చెక్ : ఈ ప్రాజెక్టులలో అత్యంత కీలకమైనది ఓరుగల్లు భూగర్భ మురుగునీటి (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) ప్రాజెక్టు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక గత ఐదేళ్లుగా వర్షాకాలంలో వరంగల్ నగరం చెరువును తలపిస్తోంది. ఇటీవల వరంగల్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామని ప్రజలకు మాటిచ్చారు. ఆ హామీని నెరవేర్చే దిశగా పంపిన ప్రతిపాదనలకు ఇప్పుడు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.4,674.6 కోట్లు. ఇందులో కేంద్రం తన వాటాగా రూ.1,168.65 కోట్లను మంజూరు చేయనుంది. దీంతో ఓరుగల్లు పారిశుద్ధ్య రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.
Also Read: https://teluguprabha.net/telangana/telangana-anganwadi-recruitment-15982-posts-notification/
ఖమ్మంలో హైటెక్ నిఘా.. కరీంనగర్‌లో మౌలిక వసతుల జోరు : ట్రాఫిక్ నియంత్రణ, విపత్తుల నిర్వహణ, నేరాల అదుపు కోసం ఖమ్మంలో అత్యాధునిక ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ను ఏర్పాటు చేయనున్నారు.
ఖమ్మం ప్రాజెక్టు: రూ.166.44 కోట్లతో ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మితమవుతుంది. (కేంద్రం వాటా రూ.41.61 కోట్లు). పోలీసు సీసీ కెమెరాలను సైతం దీనికి అనుసంధానించి, అత్యవసర సమయాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు, మైక్‌ల ద్వారా ప్రజలకు వేగంగా సూచనలు చేరవేస్తారు.
కరీంనగర్ ప్రాజెక్టు: కరీంనగర్‌లో మొత్తం రూ.840 కోట్ల అంచనాతో అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఇందులో డంపింగ్ యార్డ్ ఆధునికీకరణకు రూ.80 కోట్లు, డ్రైనేజీల పునరుద్ధరణకు రూ.130 కోట్లు, రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, స్కైవాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.630 కోట్లు కేటాయించారు. దీనిలో కేంద్రం వాటా కింద రూ.210 కోట్లు అందనున్నాయి.
తెరవెనుక అసలు కథ: బండి సంజయ్ చొరవతోనే కరీంనగర్‌కు నిధులు : వాస్తవానికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తొలి జాబితాలో కరీంనగర్ పేరు లేదు. ఈ విషయాన్ని గ్రహించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ తక్షణమే రంగంలోకి దిగారు. స్వయంగా చొరవ తీసుకుని కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి పనులకు అప్పటికప్పుడే ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌లతో ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని వివరించారు. మంత్రి బండి సంజయ్ చేసిన తీవ్ర కృషి, పట్టుదల వల్లే ఈ బృహత్తర ప్రాజెక్టుల జాబితాలో కరీంనగర్‌కు చోటు దక్కి, భారీ నిధులు మంజూరయ్యాయని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

