Caste census: జాతీయ జనగణనలో ఓబీసీల కుల గణనను చేర్చాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు (వీహెచ్) చేపట్టిన నిరాహార దీక్ష ముగిసింది. అంబర్‌పేటలోని తన నివాసం వద్ద ఆయన గత రెండు రోజులుగా దీక్షను కొనసాగించారు. అయితే ఆదివారం రాత్రి వీహెచ్ నిరాహార దీక్ష విరమించారు.
నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన నేతలు: బీసీ జేఏసీ నాయకులు దీక్షా శిబిరానికి చేరుకుని వీహెచ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ రెండు రోజుల పాటు సాగిన దీక్షకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
Also read-KCR meet: 12న బీఆర్‌ఎస్ కీలక సమావేశం.. వీటిపై తుదినిర్ణయం తీసుకోనున్న గులాబీ బాస్
కులగణనతోనే సామాజిక న్యాయం: దీక్ష విరమించిన అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఓబీసీల నిజమైన జనాభా ఎంతో తెలియాలంటే కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులాల వారీ వివరాలను సేకరించడం తప్పనిసరని అన్నారు. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయింపులు, సంక్షేమ పథకాలు అందాలంటే కుల గణన ఒక్కటే మార్గమని ఆయన పేర్కొన్నారు. కుల గణన అనేది కేవలం ఒక వర్గానిది కాదని తెలిపారు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవ సమస్యని పేర్కొన్నారు. దీనిపై కేంద్రం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని వీహెచ్ స్పష్టం చేశారు.

