Vemulawada temple earns record income: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఖజానాకు భారీ ఆదాయం సమకూరింది. జనవరి 27 వరకు అనగా కేవలం 27 రోజుల్లో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. 27 రోజుల్లో ఏకంగా 10 కోట్ల 17 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి వెల్లడించారు.
ఆలయ అభివృద్ధి పనుల కారణంగా ప్రస్తుతం శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి దేవస్థానంలో దర్శనాలు నిలిపివేసి, శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లడానికి ముందుగా వేములవాడ క్షేత్రంలో మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కొనసాగుతోంది.
ఇందులో భాగంగా గత నెల రోజులుగా లక్షలాది మంది భక్తులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో జనవరి 1వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీ భీమేశ్వరస్వామి వారి ఆలయం, బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయంలోని హుండీల ఆదాయం, ఆర్జిత సేవల టికెట్ల విక్రయం ద్వారా భారీ మొత్తంలో ఆదాయం సమకూరడం విశేషం.
శ్రీ స్వామివారి ఆలయ ఖజానాకు సమకూరిన ఆదాయంలో హుండీ లెక్కింపు ద్వారా రూ. 3.08 కోట్లు, కోడె మొక్కుల టిక్కెట్ల విక్రయం ద్వారా రూ. 3.08 కోట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 1.48 కోట్లు, శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం టిక్కెట్ల ద్వారా రూ. 15 లక్షలు, అభిషేకం టికెట్ల ద్వారా రూ. 8 లక్షలు, వసతి గదుల అద్దె ద్వారా రూ. 37 లక్షలు, శీఘ్ర దర్శనం, బ్రేక్ దర్శనం టికెట్ల ద్వారా రూ. 68 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.




