VH key statement on PM Modi: ప్రధాని మోడీ రేపటి తెలంగాణ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు కీలక ప్రకటన చేశారు. జనగణనలో భాగంగా బీసీ కులగణన సైతం చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలని వీహెచ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని తన నివాసంలో ఉదయం పదిన్నర గంటల నుంచి ఆయన దీక్ష మొదలెట్టారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. “కేంద్ర ప్రభత్వం చేపడుతున్న జనగణనలో బీసీల కాలంను సైతం పొందుపర్చాలి. బీసీ జనం పెరుగుతున్నారు.. జనగణన ద్వారా మాకు న్యాయం చేయాలి. ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కగట్టి వారికి న్యాయం చేస్తున్నారు. మరి, బీసీలు మీకు కనబడటం లేదా?” అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రధాని మోడీకి ఇప్పటికే రెండు లెటర్స్ రాశామని, వాటికి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలపై నిర్ణయం తీసుకున్న తర్వాతే మోడీ తెలంగాణకు రావాలని, బీసీలకు న్యాయం జరగాలని, ఉద్యోగాలు రావాలని తెలిపారు. బీసీ జనాభా లెక్కల విషయంలో మోడీ సానుకూల నిర్ణయం తీసుకునేలా తెలంగాణ బీజేపీ ఎంపీ ఒత్తిడి చేయాలని. దేశాన్ని ముక్కలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ, మతపరంగా ముందుకు వెళ్తోందని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్లలోనూ బీసీలకు కోట ఇవ్వలేదని, దీనిపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో కొట్లాడారని, తరచూ బీసీని అని చెప్పుకునే మోడీ నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లేదంటే దేశం మొత్తం తిరిగి మోడీని, బీజేపీని ఎండగడతానని హెచ్చరించారు.
Also read: https://teluguprabha.net/telangana/cm-revanth-plans-to-make-hyderabad-a-signal-free-city/

