హైదరాబాద్ సిటీబ్యూరో (తెలుగు ప్రభ): తెలంగాణకు చెందిన 40 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ)కి రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ, అభివృద్ధి విభాగాల సలహాదారు వి. హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఎన్సీబీసీ చైర్‌పర్సన్ సాధ్వి నిరంజన్ జ్యోతి మర్యాదపూర్వకంగా వీహెచ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 40 బీసీ కులాలను కేంద్ర ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) జాబితాలో చేర్చాలనే దీర్ఘకాలిక ప్రతిపాదనపై చర్చించారు. అనంతరం, ఈ ప్రతిపాదనపై సమగ్ర వివరాలతో కూడిన నివేదికను ఎన్సీబీసీకి అధికారికంగా వీహెచ్ సమర్పించారు. ఈ 40 బీసీ కులాలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల ప్రయోజనాలు అందేలా చూసేందుకు, వారిని కేంద్ర ఓబీసీ జాబితాలో త్వరితగతిన చేర్చాలని ఆయన కోరారు. వినతిపత్రంపై ఎన్సీబీసీ చైర్‌పర్సన్ సాధ్వి నిరంజన్ జ్యోతి సానుకూలంగా స్పందించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర విద్యా సంస్థల్లో సీట్లు కోల్పోతున్నారు..
పెండింగ్‌లో ఉన్న సాంకేతిక అడ్డంకులను తొలగించి, త్వరితగతిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సమస్యను వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఓబీసీలకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ 40 కులాలను కేంద్ర జాబితా నుండి మినహాయించడం వల్ల స్థానిక యువత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర విద్యా సంస్థల్లో సీట్లను కోల్పోతున్నారని వీహెచ్ ఈ చర్చలో నొక్కి చెప్పారు. చైర్‌పర్సన్ ఇచ్చిన బలమైన హామీ పట్ల వీహెచ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రక్రియ త్వరితగతిన అమలయ్యేలా, బాధిత వర్గాలకు న్యాయం జరిగేలా తెలంగాణ ప్రభుత్వం కమిషన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని ఆయన పేర్కొన్నారు.
Also Read: B.Tech student: బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. కాలేజీ వేధింపులే కారణమంటూ ఆరోపణలు..!


