హనుమకొండ, అక్టోబర్ 5 (తెలుగు ప్రభ): రాష్ట్రంలోని ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ విజయ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రారంభించారు. హనుమకొండ బస్టాండ్ ఆవరణలో, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్ వాటిని ప్రారంభించారు. అనంతరం కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల పాల ఉత్పత్తులను పరిశీలించారు.
ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడంలో విజయ డెయిరీ కీలక పాత్ర పోషిస్తోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. నగర ప్రజలకు ఉత్పత్తులు సులభంగా అందుబాటులో ఉండేలా కేంద్రాలను ఏర్పాటు చేయడం ఉపయోగకరమన్నారు. ముఖ్యంగా బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు, ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి సహాయకులు, సిబ్బందికి ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా విజయ డెయిరీ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ప్రజలు ఈ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా నాణ్యమైన పాల ఉత్పత్తులను సులభంగా పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ డీడీ ధనరాజ్, జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకమండలి సభ్యులు ఈవి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

