HomeతెలంగాణSiddipet: ప్రజల ఓటు హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదు..!

Siddipet: ప్రజల ఓటు హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదు..!

సిద్దిపేట, అక్టోబర్ 15 (తెలుగు ప్రభ): రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదని కవులు, రచయితలు, జర్నలిస్టులు, ప్రజాసంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో గందరగోళం నెలకొందని, అర్హులైన ఓటర్ల పేర్లు పెద్ద సంఖ్యలో తొలగిపోతున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

మంజీరా రచయితల సంఘం, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సిద్దిపేట జిల్లా శాఖ, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక, తెలంగాణ వికాస సమితి, తెలంగాణ రచయితల సంఘం, ప్రజాసంఘాల ఐక్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో చర్చాగోష్ఠి నిర్వహించారు. మంజీరా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి సిద్దెంకి యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు వక్తలు సర్ ప్రక్రియ, కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అనర్హులైన ఓటర్లను తొలగించాల్సిన ప్రక్రియలో అర్హులైన వారి ఓట్లు కూడా గల్లంతవుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 13.5 కోట్ల ఓట్లు, తెలంగాణలో దాదాపు 70 లక్షల ఓట్లు తొలగిపోతున్నాయంటూ వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగిపోవడానికి కారణాలేమిటో ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు, విద్యా ధ్రువపత్రాలు పుట్టిన తేదీ నిర్ధారణకు సరిపోవంటూ అధికారులు చెబుతున్నారని విమర్శించారు. ఇటువంటి నిబంధనలు సామాన్య ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. బతికి ఉన్న ఓటర్లకు సైతం నోటీసులు జారీ చేయడం ఆందోళనకరమని అన్నారు. మరణించినవారి పేర్లు, రెండుచోట్ల నమోదైన ఓట్లను తొలగించేందుకు ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

గతంలోనూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలు జరిగినప్పటికీ, ప్రస్తుత స్థాయిలో గందరగోళం కనిపించలేదని వక్తలు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

కేంద్రం మౌనం ఎందుకు?

సర్ ప్రక్రియపై అనుమానాలను నివృత్తి చేసి, అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వంపై ఉందని వక్తలు అన్నారు. ఈ అంశంపై ప్రశ్నిస్తున్న యువత, విద్యార్థులపై నిర్బంధ చర్యలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ వేదికగా సర్ ప్రక్రియను నిలిపివేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న యువతకు మద్దతు ప్రకటించారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. సర్ ప్రక్రియను నిలిపివేసి, దేశవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సులభంగా ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది.

ఈ చర్చాగోష్ఠిలో మంజీరా రచయితల సంఘం, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కె. రంగాచార్య, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నాల బాలయ్య, తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు నందిని భగవాన్ రెడ్డి, తెరసం గౌరవ అధ్యక్షుడు తోట అశోక్, ప్రధాన కార్యదర్శి గంభీర్రావుపేట యాదగిరి, ప్రజాసంఘాల నేత పోచబోయిన శ్రీహరి, జర్నలిస్టు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూతురు రాజిరెడ్డి, ప్రజాసంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు వి. సంతోష్, ప్రముఖ కవి, మరసం మాజీ అధ్యక్షుడు అలాజ్‌పూర్ కిషన్, మరసం ఉపాధ్యక్షులు అలాజ్‌పూర్ శ్రీనివాస్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News