HomeతెలంగాణWarangal: నోటిఫికేషన్ దశలోనే భూసేకరణ.. ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు ఎప్పటికి పూర్తయ్యేను?

Warangal: నోటిఫికేషన్ దశలోనే భూసేకరణ.. ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు ఎప్పటికి పూర్తయ్యేను?

వరంగల్ ప్రతినిధి, అక్టోబర్ 11 (తెలుగు ప్రభ): వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. మూడేళ్ల క్రితం ఆర్టీఓ జంక్షన్ (నాయుడు పంపు జంక్షన్) నుంచి చింతల్ మధ్య ప్రారంభమైన రోడ్డు పనులు ఇంకా పూర్తికాలేదు. ఇప్పటివరకు 75 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు తెలుస్తోంది. మిగిలిన పనులు ఎప్పటికి పూర్తవుతాయి? రోడ్డు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

నామమాత్రంగా నిర్మించిన రోడ్డులోనూ ముళ్లపొదలు పెరగడం గమనార్హం. మరోవైపు, పలుచోట్ల భూసేకరణ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చింతల్ నుంచి ఏనుమాముల మార్కెట్ మధ్య రోడ్డు పనులు ఏమాత్రం ముందుకు సాగడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏనుమాముల నుంచి కొత్తపేట క్రాస్ రోడ్డు సమీపంలోని ఎన్ఎస్ఆర్ ఆస్పత్రి వరకు ప్రతిపాదిత రోడ్డు నిర్మాణానికి ఇంకా భూసేకరణ జరగాల్సి ఉంది. భూసేకరణ కోసం రెండు నెలల క్రితం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. భూసేకరణకు రూ.105 కోట్లు, నిర్మాణ పనులకు దాదాపు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో నిధులు కేటాయించినప్పటికీ జాప్యం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

ఇంకా సర్వే దశలోనే..

కుడా 1971 మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆర్టీఓ కార్యాలయం (నాయుడు పంపు) జంక్షన్ నుంచి చింతల్ మీదుగా ఏనుమాముల మార్కెట్ నుంచి ఆరెపల్లి వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. 2041 మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏనుమాముల నుంచి కొత్తపేట క్రాస్‌లోని ఎన్ఎస్ఆర్ ఆస్పత్రి వరకు మార్గాన్ని మార్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీఓ జంక్షన్ నుంచి చింతల్ మధ్య రోడ్డు పనులు ప్రారంభమై కొంతమేర పూర్తయ్యాయి. మొత్తం 13.3 కిలోమీటర్ల ప్రతిపాదిత ఇన్నర్ రింగ్ రోడ్డులో మొదటి దశగా సుమారు 8 కిలోమీటర్ల మేర పనులు చేపట్టారు.

చింతల్ నుంచి కట్టమల్లన్న గుడి ప్రాంతం మీదుగా ఏనుమాముల మార్కెట్ వరకు రోడ్డు పనులు ఇంకా సర్వే దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. డీజీపీఎస్ సర్వే పూర్తి చేసి, సెంట్రల్ లైన్ మార్కింగ్ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మార్గంలో రోడ్డు నిర్మాణానికి రూపం రావడానికి మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏనుమాముల నుంచి కొత్తపేట క్రాస్ వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రతిపాదిత రోడ్డు నిర్మాణానికి భూసేకరణ జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే పనులు ముందుకు సాగే పరిస్థితి ఉంది. దీంతో భూసేకరణను త్వరగా పూర్తి చేసి, రోడ్డు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

విమానాశ్రయ పనులపై ప్రభావం పడే అవకాశం

వరంగల్ విమానాశ్రయ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కల్పించడం కీలకంగా మారనుంది. నగరంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ నియంత్రణలోనూ ఇన్నర్ రింగ్ రోడ్డు కీలక పాత్ర పోషించనుంది. అయితే, రింగ్ రోడ్డు పనుల్లో జాప్యం జరిగితే విమానాశ్రయానికి రహదారి అనుసంధానంపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు ఆశించిన స్థాయిలో పూర్తికాలేదు. కొన్ని చోట్ల రోడ్డు విస్తరణ పనులు సగంలోనే నిలిచిపోయాయి. కల్వర్టులు, డ్రైనేజీ నిర్మాణాలు కూడా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News