నల్లబెల్లి (దుగ్గొండి) (తెలుగు ప్రభ): అసలే కరువు పరిస్థితులు.. చుక్క నీటి కోసం నానా అవస్థలు.. అయినా రెక్కలు ముక్కలు చేసుకుంటూ పంటను కాపాడుకునేందుకు రైతు పడే ఆరాటం వర్ణనాతీతం. దుగ్గొండి మండలం భూపతూరు–మల్లంపల్లి–గోపాలపురం ప్రధాన రహదారి పక్కనే ఓ చిన్నకారు రైతు సాగు చేస్తున్న మిర్చి పంట ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది.
కష్టనష్టాలను ఓర్చుకుంటూ సాగు చేసిన పంట ఏపుగా పెరగడంతో రైతు శ్రమకు ఫలితం దక్కినట్లయింది. అయితే పంటకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, దిష్టి తగలకుండా పంట మధ్యలో ఫొటోలు ఏర్పాటు చేయడం చూపరులను ఆకట్టుకుంటోంది. ఆ ఫొటోలను చూసిన ప్రయాణికులు సైతం రైతు కష్టాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘అయ్యో పాపం.. ఎంత కష్టపడి పంట పండించాడో.. ఆ పంట చేతికందే వరకు కాపాడవయ్యా దేవుడా!’ అంటూ మనసులోనే వేడుకుంటున్నారు.
పంటకు దిష్టి తగలకుండా రైతు చేసిన ప్రయత్నం వెనుక.. పంట చేతికొచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న రైతన్న ఆరాటం కనిపిస్తోంది. నిజంగా ఆ ఫొటోలు పంటకు దిష్టి తగలకుండా ఉన్నాయో లేదో తెలియదు కానీ.. రైతు కష్టాలను మాత్రం ప్రతి ఒక్కరికీ కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. రైతు చెమట చుక్కలకు గిట్టుబాటు దక్కి పంట చేతికందాలని కోరుకుందాం!

