బతుకమ్మ పువ్వు బంగారమాయె
-తంగేడు పువ్వుకు తండ్లాట
-కానరాని ముత్యంపువ్వు
-గునుగు పువ్వే దిక్కయే
జనగామ, (తెలుగుప్రభ): బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ … తంగేడులో పూసినవమ్మ మాతల్లి బతుకమ్మ అని మనం పాడుకుంటాము… బతుకమ్మ పండుగ అంటే ప్రకృతిని ఆరాధించడం. తెలుగింటి ఆడపడుచులు ప్రకృతిలో పూసిన పువ్వులన్నీ ఏరుకొచ్చి ఒక పద్ధతి ప్రకారం పేర్చి బతుకమ్మ రూపం తెస్తారు. ఏర్చి పేర్చిన బతుకమ్మను గౌరమ్మగా, బొడ్డెమ్మగా భావించి మహిళలు పూజిస్తారు. ప్రకృతి ప్రసాదించిన బతుకమ్మను మహిళలు గౌరవంగా ఆటపాటలతో సంబరాలు చేసి చివరికి నీళ్లలో భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే మహిళలకు ఎనలేని ఆనందం ఇప్పుడు ఆ ఆనందం ఆవిరయ్యే పరిస్థితులు దాపించాయి. ప్రకృతిలో దొరికే పువ్వులు బతుకమ్మకు వేసుకునేందుకు దొరకని దుస్థితి వచ్చింది. ప్రకృతిలో దొరికే పువ్వులపై ప్రకృతే కన్నెర చేయడంతో బతుకమ్మ పువ్వులు బంగారమయింది.
కరువు, రియల్ తో పువ్వు కరువు
బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఒకప్పుడు ఎక్కడ చూసినా తంగేడు పువ్వు విపరీతంగా దొరికేది. ఇప్పుడు తంగేడు పువ్వు కోసం ఎంత తండ్లాడిన, వెతికినా దొరకని దుస్థితి నెలకొంది. తంగేడు చెట్లను ఓవైపు రియల్ ఎస్టేట్స్ పేరుతో నరికి వేయగా, మరోవైపు ఎల్ నినో ప్రభావం పడింది. కరువు కోరల్లో చిక్కిన ప్రాంతాల్లో కొద్దో గొప్పో ఉన్న తంగేడు చెట్లు పువ్వు పూయలేదు. తంగేడు పువ్వు పై కరువు ప్రభావం తీవ్రంగా పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తంగేడు పువ్వు దొరకకపోగా ముత్యం పువ్వులు జాడే లేకుండా పోయిందని, గునుగు పూల తోటే బతుకమ్మ పేర్చుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంగట్లో అంగట్లో బతుకమ్మ పువ్వు
ప్రకృతి ప్రసాదించిన బతుకమ్మ పువ్వు ఇప్పుడు అంగట్లో సరుకు అయింది. తంగేడు, గునుగు, టేకు పూలను సంతలు, కూరగాయల మార్కెట్లు, పట్టణ ప్రాంతాల్లో అమ్ముతుండడం విశేషం. బతుకమ్మ పువ్వును కొండకోనలు అటవీ ప్రాంతాల్లో నివాసముండే గిరిజనులు, లంబాడీలు సేకరిస్తూ పట్టణ ప్రాంతాల్లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే గిరిజనులు పువ్వు సేకరణ ప్రధాన పనిగా పెట్టుకుని, పువ్వులకు రంగులద్ది మార్కెట్లో అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. బతుకమ్మ పువ్వు అంగట్లో ఖరీదైన సరుకుగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తంగేడు పువ్వు దొరకతలేదు : శోభారాణి గృహిణి
బతుకమ్మ పేర్చుకునేందుకు తంగేడు పువ్వు దొరకలేదు. మార్కెట్లో దొరికే బంతిపూలను కొనుక్కొని బతుకమ్మను పేర్చుకుంటున్నాము. తంగేడు చెట్లు అన్ని నరకడంతో తంగేడు పువ్వు కరువైంది. ముత్యాల పువ్వులు దొరుకుతనే లేవు. గునుగు పువ్వు కూడా రాను రాను కరువైతుంది.

