Homeతెలంగాణవరంగల్Bathukamma : పూల పరిమళం, భారతీయ విద్యా మందిర్‌లో బతుకమ్మ వైభవం

Bathukamma : పూల పరిమళం, భారతీయ విద్యా మందిర్‌లో బతుకమ్మ వైభవం

Bathukamma celebrations in school : తెలంగాణ సాంస్కృతిక వైభవానికి నిలువుటద్దమైన పూల పండుగ బతుకమ్మ.. ఆ పాఠశాల ప్రాంగణంలో పల్లె సొగసుల దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించింది. తరగతి గది పాఠాలకే పరిమితం కాకుండా, భావితరాల గుండెల్లో నేలతల్లి మూలాలను నాటేందుకు ఆ యాజమాన్యం వేసిన అడుగేమిటి? లేత చేతులతో తీరొక్క పూలు పేర్చి విద్యార్థినులు చేసిన ఆ సంస్కృతి విన్యాసం ఎలా అలరించిందో తెలుసా?

- Advertisement -

కన్నులపండువగా వేడుకలు : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురం స్టేజి సమీపంలోని భారతీయ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. నేటి బాలలకు మన పండుగల విశిష్టతను, సాంస్కృతిక ఆవశ్యకతను తెలియజెప్పే సదుద్దేశంతో పాఠశాల యాజమాన్యం ముందస్తుగా ఈ వేడుకలను నిర్వహించింది. విద్యార్థులు ఉదయమే గునుగు, తంగేడు, బంతి, చామంతి పూలను సేకరించి ఆకర్షణీయమైన రీతుల్లో బతుకమ్మలను ముస్తాబు చేశారు.

లయబద్ధంగా ఆటపాటలు.. పురస్కారాలు : సంప్రదాయ వస్త్రధారణతో విచ్చేసిన ఉపాధ్యాయినులు, విద్యార్థినులు బతుకమ్మలను కొలువుదీర్చి గౌరీదేవి కీర్తనలతో భక్తిభావం చాటారు. అనంతరం లయబద్ధమైన డీజే పాటలకు విద్యార్థులు నృత్యాలు చేస్తూ ప్రాంగణాన్ని హోరెత్తించారు. అత్యంత నైపుణ్యంతో అందంగా బతుకమ్మలను పేర్చిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.

సంస్కృతిని నిలబెట్టేందుకే: కరస్పాండెంట్ దంపతులు : ఆధునిక పోకడల్లో కొట్టుకుపోతున్న నేటి తరానికి మన సంప్రదాయాల గొప్పతనాన్ని చాటడమే ఈ సంబరాల ముఖ్య ఉద్దేశమని పాఠశాల కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయిని కె. శ్రీధర్ రెడ్డి-నిరంజని దంపతులు పేర్కొన్నారు. అనంతరం బతుకమ్మలను గ్రామ వీధుల్లో కోలాహలంగా ప్రదర్శించి, సమీప జలాశయంలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News