Vardhannapet Municipality: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌లో ఉత్కంఠ నెలకొంది. ఫలితాల వెల్లడి సమయంలో బీఆర్‌ఎస్ నేతలు కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఫలితాలు తారుమారు అయ్యాయంటూ ఆరోపిస్తన్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/congress-won-90-seats-in-municipality-elections/
వర్ధన్నపేట మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల్లో కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆధిక్యంలో ఉన్న తమ అభ్యర్థులను ఉద్దేశపూర్వకంగా ఓడించారని ఆరోపించారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వెలుపల బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరగ్గా.. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆందోళన సద్దుమణిగింది.
ముఖ్యంగా 12వ వార్డు ఫలితాల విషయంలో రీకౌంటింగ్ నిర్వహించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొదట బీఆర్‌ఎస్ అభ్యర్థి 7 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. రీకౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి 13 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటన చేయడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు 11వ వార్డులో బీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థి కోసం అధికారులు నాలుగు సార్లు రీకౌంటింగ్ నిర్వహించారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచిన చోట రీకౌంటింగ్ చేస్తున్నారని.. తాము అభ్యర్థించిన చోట మళ్లీ లెక్కింపు చేయడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తన అనుచరులతో కలిసి వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి స్పందించి రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టత వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.

