శాయంపేట, (తెలుగుప్రభ): తహరాపూర్ శివారులోని కొడిశలకుంట సమీపంలో భూమి, దారి ఆక్రమణకు గురైందని పలువురు దళిత రైతులు ఆరోపించారు.సర్వే నంబర్ 107లోని భూమికి సంబంధించి కాటం తిరుపతిరెడ్డి, ఆయన కుమారుడు రవీందర్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.
రేణికుంట్ల సదయ్య, కొమ్ముల మల్లయ్యతో పాటు తహరాపూర్‌కు చెందిన దళిత రైతులు ఈ ఫిర్యాదును సమర్పించారు.
సుమారు 40 సంవత్సరాల క్రితం క్రషర్ కోసం దాదాపు రెండు ఎకరాల భూమిని రూ.60 వేలకే గుత్తాగా కొనుగోలు చేశారని వారు తెలిపారు.
అయితే పహాణీలో ఉన్న విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని సుమారు మూడు ఎకరాల భూమిని అక్రమంగా పత్రాలు సృష్టించి పట్టా చేసుకున్నారని ఆరోపించారు.
దళిత రైతులకు రాకపోకలు లేకుండా…
అదేవిధంగా భూమికి సంబంధించిన కట్ట, దారిని కూడా ఆక్రమించుకుని దళిత రైతులకు రాకపోకలు లేకుండా చేశారని పేర్కొన్నారు.
కట్టపై క్రషర్ ర్యాంపు నిర్మించడంతో తమ పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో అధికారులు సర్వే నిర్వహించి ఎవరి భూమికి వారికి హద్దులు నిర్ణయించి, నక్షా కూడా రూపొందించి వెళ్లారని తెలిపారు.
అయినప్పటికీ మళ్లీ అక్రమంగా పత్రాలు సృష్టించి కొత్తగా సర్వే చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
దారి, కట్ట తమ భూమిలో భాగమని చూపించి ఇతరులకు విక్రయించే ప్రయత్నం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని వారు కలెక్టర్‌ను కోరారు. గతంలో నిర్వహించిన సర్వే రికార్డులు, పహాణీ, నక్షా తదితర పత్రాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. దళిత రైతుల రాకపోకలకు ఉన్న సంప్రదాయ దారిని పునరుద్ధరించాలని కోరారు.
భూమి, కట్ట, దారి ఆక్రమణకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం చేసి వ్యవసాయ భూములకు స్వేచ్ఛగా రాకపోకలు కల్పించాలని దళిత రైతులు కలెక్టర్‌ను కోరారు.
Also Read:Adulterated : కల్తీ నెయ్యిపై పోలీసుల ఉక్కుపాదం.. భాగ్యనగరంలో 36 టన్నుల నకిలీ సరుకు సీజ్

