- డైనింగ్ హాల్లో టేబుళ్లు, కుర్చీలు లేక తీవ్ర ఇబ్బందులు
- తాగునీటికీ తిప్పలే.. ఆర్వో ప్లాంట్ లేక బోర్ నీళ్లే దిక్కు
- పట్టించుకోని ఐటీడీఏ అధికారులు.. తక్షణమే స్పందించాలని డిమాండ్
గూడూరు (తెలుగు ప్రభ): ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు మాత్రం తీరడం లేదు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ (బాలుర) హైస్కూల్లో విద్యార్థులు తీవ్రమైన వసతుల లేమితో అల్లాడుతున్నారు. భవన నిర్మాణాలు పూర్తయినప్పటికీ, అవసరమైన కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థుల పరిస్థితి తీవ్రంగా తయారైంది.
డైనింగ్ హాల్ ఉంది.. టేబుళ్లు లేవు..
మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులు డైనింగ్ హాల్లోకి వెళ్తున్నప్పటికీ, అక్కడ కూర్చోవడానికి బెంచీలు, టేబుళ్లు లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. డైనింగ్ హాల్లోనే నేలపై కూర్చుని లేదా బయట చెట్ల కింద, మెట్లపై కూర్చుని భోజనం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం భవనాన్ని మంజూరు చేసినా, డైనింగ్ టేబుళ్లు, స్టాండ్లు కేటాయించకపోవడంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు.
తాగునీటికీ కష్టాలే..
మరోవైపు పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీటి (ఆర్వో వాటర్) సదుపాయం కూడా అందుబాటులో లేదు. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత విద్యార్థులు తాగునీటి కోసం డైరెక్ట్ బోర్ నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి.
తల్లిదండ్రుల ఆవేదన..
బడుగు, బలహీన వర్గాలకు చెందిన తమ పిల్లలు హాస్టళ్లలో ఉంటూ మంచి విద్యతో పాటు పౌష్టికాహారం పొందుతారని ఆశించిన తల్లిదండ్రులకు ఈ పరిస్థితులు చూసి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏటూరునాగారంలోని ఐటీడీఏ (ITDA) అధికారులు విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సీతానగరం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఐటీడీఏకు వినతిపత్రం ఇచ్చాం..
పాఠశాలలో టేబుళ్లు, స్టాండ్లు, ఆర్వో వాటర్ ప్లాంట్ తదితర మౌలిక వసతుల కల్పన కోసం ఐటీడీఏ అధికారులకు ఇదివరకే వినతిపత్రాలు సమర్పించామని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి ఐటీడీఏ ద్వారా వెంటనే అవసరమైన వసతులను మంజూరు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.



