Homeతెలంగాణవరంగల్Independence Day: హనుమకొండలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

Independence Day: హనుమకొండలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

హనుమకొండ (తెలుగుప్రభ): భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి , ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా వందనం సమర్పించారు. అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతలతో కలిసి పోలీసుల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, సాధించిన ప్రగతిని వివరించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని, దేశ సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులను, వారి కుటుంబ సభ్యులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనంగా సన్మానించారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు.

- Advertisement -

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన: వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనలు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వ్యవసాయ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, మత్స్య, గృహ నిర్మాణ, విద్య, జీడబ్ల్యూఎంసీ, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖలు తాము సాధించిన ప్రగతిని శకటాల ద్వారా కళ్లకు కట్టాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గేయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విధి నిర్వహణలో అంకితభావంతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని గుర్తించి.. మంత్రి పొంగులేటి చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ సీపీ ఎన్. శ్వేత, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డీసీపీ ధార కవిత, అదనపు కలెక్టర్ రవి, డీఆర్ఓ శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, నగర ప్రముఖులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News