వేలేరు (తెలుగు ప్రభ): గండి రామారం ఎత్తిపోతల పథకం ద్వారా అతి త్వరలోనే వేలేరు మండలానికి గోదావరి జలాలను తీసుకువచ్చి రైతులకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నలుగురు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.4,00,464 విలువైన చెక్కులను,తొమ్మిది మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు రూ.3,49,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
దాడిలో గాయపడిన లక్ష్మణ్ నాయక్‌కు పరామర్శ..
అనంతరం ఇటీవల దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్‌ను కడియం శ్రీహరి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని గాయాలను పరిశీలించారు. దాడికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, అధైర్యపడవద్దని, ఎమ్మెల్యేగా తాను, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.పీచర గ్రామానికి చెందిన శివరాత్రి వెంకటలక్ష్మి,ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన పింగిలి మణెమ్మ ఇటీవల మృతి చెందడంతో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని అన్నారు.పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను,రెండో ఏడాది 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసి మొత్తం 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను అందించిందని పేర్కొన్నారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూ, ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,సన్న బియ్యం పంపిణీ,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్లు,రైతు భరోసా వంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయని చెప్పారు.రూ.7,800 కోట్ల రైతు భరోసా నిధులను 75 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.
యాసంగికి సాగునీరు అందించడమే లక్ష్యం..
వేలేరు మండల రైతులకు సాగునీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమని కడియం శ్రీహరి అన్నారు. యాసంగి పంటలకు గండి రామారం లిఫ్ట్ 1 పనులను పూర్తి చేసి వేలేరుకు గోదావరి జలాలను తీసుకువస్తామని స్పష్టం చేశారు.నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నానని తెలిపారు.ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో,వివిధ గ్రామాల సర్పంచులు,ప్రజాప్రతినిధులు, అధికారులు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


