నర్సంపేట (తెలుగు ప్రభ): తిమ్మంపేట గ్రామంలోని పల్లె దవాఖానాలో వైద్య సేవలు రోజురోజుకూ అస్తవ్యస్తంగా మారుతున్నాయని గ్రామ సర్పంచ్ మోడం శ్రీలత ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గ్రామంలోని పల్లె దవాఖానాను సందర్శించగా విధుల్లో ఉండాల్సిన డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో పాటు, ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు ఉండటాన్ని గుర్తించినట్లు తెలిపారు.
గత కొంతకాలంగా పల్లె దవాఖానాలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పృథ్వీరాజ్ నెలల తరబడి విధులకు హాజరు కావడం లేదని, ఆయనకు ఇచ్చిన డిప్యూటేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులు వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందన్నారు.

దవాఖానాలో పనిచేసే సిబ్బంది సైతం సమయపాలన పాటించడం లేదని, కనీసం బీపీ, షుగర్ రోగులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో లేవని చెప్పడం బాధాకరమన్నారు. ఈ సమస్యలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరైన స్పందన లభించలేదని ఆరోపించారు.
కలెక్టర్, జిల్లా మంత్రి వెంటనే స్పందించాలి!
జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి తక్షణమే ఈ సమస్యపై స్పందించి, డాక్టర్‌కు ఇచ్చిన డిప్యూటేషన్‌ను రద్దు చేసి, తిమ్మంపేట పల్లె దవాఖానాలో రెగ్యులర్‌గా వైద్యుడు విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాలం చెల్లిన మందులపై విచారణ జరిపి, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ నాయకులు భూమా అశోక్, కడారి సురేష్, రాజ్‌కుమార్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

