పాలకుర్తి, (తెలుగు ప్రభ): పాలకుర్తి మండలంలోని 36 గ్రామం పంచాయతీల పరిధిలో నిరంతరంగా 24 * 7 అక్రమ మద్యం దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తూ పేదల, అణగారిన వర్గాల జేబులు గుల్ల చేస్తూ, వారు అనారోగ్యం పాలై వారి పిల్లలు, భార్యలు అనాధలుగా మారుతున్నరని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పాలకుర్తి మండల కార్యదర్శి కొనకటి కళింగరాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కలిసి ఆదివారం ఎక్సైజ్ సీఐ వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా కళింగ రాజు మాట్లాడుతూ పాలకుర్తి మండల కేంద్రంతో పాటు 36 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 150 నుండి 200 వరకు మద్యం దుకాణాలు అక్రమంగా నిర్వహిస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ అడిగిన వారిని బెదిరిస్తున్న సంఘటనలు ఉన్న సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్టు పట్టి పట్టనట్లు వ్యవహరించడంలో అంతర్యమేమిటని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఎమ్మెర్పి కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ అవసరమైతే వినియోగదారుల పైన దాడులకు, బెదిరింపులకు కూడా పాల్పడుతున్న సంఘటనలు ఎక్సైజ్ అధికారులకు కనిపిస్తలేవని ఆయన అన్నారు.
ఈ మద్యం దుకాణాల నిర్వహణ వల్ల అనేకమంది పేదలు, అణగారిన వర్గాలకు చెందిన యువత మద్యానికి బానిసై ఇండ్లలో భార్యాబిడ్డలను వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్న సందర్భాలు, తగువులాటలు పోలీస్ స్టేషన్ వరకు వచ్చి. పచ్చనిసంసారంలో చిచ్చు లేపుతున్న మద్యం దుకాణాలను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులు మద్యం సిండికేట్ వ్యాపారులు ఇచ్చే మామూళ్లకు ఆశపడి అణగారిన వర్గాల కుటుంబాలలో చిచ్చు రేపుటకి కారణమవుతున్నారని కళింగరాజు అన్నారు.
వెంటనే మండల కేంద్రంతో పాటు అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై దాడులు నిర్వహించి షాపులను మూయించవలసిందిగా కళింగ రాజు అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు గాయాల బాబు, గ్యార రాజు పెద్ది రాహుల్.,తూర్పాటి సారయ్య,కొన్ని బద్రి తదితరులు పాల్గొన్నారు.

