Enumamula market: ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో మిర్చి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. శుక్రవారం జరిగిన వేలంలో దేశీ రకం మిర్చి క్వింటాలుకు ఏకంగా రూ. 50,000 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పుల్లూరుపల్లి గ్రామానికి చెందిన రైతు ఏ. రవీందర్ రావు తీసుకొచ్చిన దేశీ మిర్చికి ఈ అత్యధిక ధర లభించింది. గత మూడేళ్ల కాలంలో దేశీ రకానికి ఈ స్థాయి ధర లభించడం ఇదే మొదటిసారి. గతంలో 2023లో క్వింటాలుకు గరిష్టంగా రూ. 90,000 ధర లభించిన రికార్డు ఉంది.
ఇతర రకాల పరిస్థితి: దేశీ రకంతో పాటు వండర్ హాట్ రకానికి క్వింటాలుకు రూ. 37,000 వరకు ధర లభిస్తోంది. అలాగే తేజా, దీపిక, ఎల్లో మిర్చి రకాలకు సైతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్‌కు రోజుకు సగటున 12 వేల నుంచి 15 వేల బస్తాల మిర్చి వస్తోందని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు.గత కొన్ని రోజులుగా రూ. 30 వేల నుండి రూ. 40 వేల మధ్య ఊగిసలాడిన ధర.. ఒక్కసారిగా రూ. 50 వేలకు చేరడంతో మిర్చి సాగు చేసిన రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
ధరలు పెరగడానికి కారణాలు:
- మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడం.
- ప్రతికూల పరిస్థితుల వల్ల దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడం.
- అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ మిర్చికి పెరుగుతున్న డిమాండ్.

