Tragedy Bhupalapally District: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావి పూడిక తీస్తుండగా క్రేన్ వైర్ తెగి బావిలో పడటంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల గ్రామంలో వ్యవసాయ బావి పనులు ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. బావిలో పూడిక తీసే పనులు జరుగుతుండగా, అకస్మాత్తుగా క్రేన్ వైర్ తెగిపోయింది. దీంతో క్రేన్‌తో పాటు దానిపై ఉన్నవారు బావిలో పడిపోయారు. ఈ దుర్ఘటనలో పైడయ్య (53), సుకినే వాసుదేవరావు (48), బండారి అభిలాష్ (16) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి మోహన్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా నిరుపేద కుటుంబానికి చెందిన అభిలాష్ పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఇంట్లో ఆర్థిక అవసరాల కోసం కూలి పనికి వెళ్లగా అనుకోని మృత్యువుతో తీరని లోకాలకు చేరాడు. మృతుల కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.

