నల్లబెల్లి, దుగ్గొండి, (తెలుగు ప్రభ):ప్రయాణికులకు నీడనిచ్చి, సేదతీర్చాలన్న ఉన్నత లక్ష్యంతో ఆర్టీసీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు నిర్మించిన బస్టాండ్లు నేడు నిరుపయోగంగా మారుతున్నాయి. నర్సంపేట నుంచి వరంగల్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై కొమ్మాల, ఊకల్, గీసుకొండతో పాటు దుగ్గొండి తో పాటు పలు గ్రామాల్లోని బస్టాండ్లలో ఇదే దుస్థితి కనిపిస్తోంది. ప్రయాణికుల కోసం నిర్మించిన బస్టాండ్లు చెత్తకుప్పలుగా మారడమే కాకుండా ద్విచక్ర వాహనాల పార్కింగ్ కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి.
బస్టాండ్లలో బస్సులు ఆగకపోవడంతో…
మరోవైపు బస్టాండ్లలో బస్సులు ఆగకపోవడంతో ప్రయాణికులు రోడ్లపైనే నిలబడి బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. ఎండకు, వానకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఉన్నత ఆశయంతో నిర్మించిన బస్టాండ్లను నిర్వహించాల్సిన ఆర్టీసీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
లక్షలాది రూపాయలతో నిర్మించిన ప్రజోపయోగ వసతులు ఇలా నిరుపయోగంగా మారితే వాటి వల్ల ప్రయోజనమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్పందించి బస్టాండ్లను శుభ్రపరచి, ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ను నివారించి, బస్సులు బస్టాండ్లలోనే ఆగేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Also Read: Machkal: ప్రతి నీటి బొట్టుకు భద్రత.. వేసవి నీటి ఎద్దడికి ముందస్తు చెక్

