Warangal MGM Hospital: వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (MGM) ఆస్పత్రిలో మరోసారి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాల్సిన ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. కనీసం మృతదేహాన్ని తరలించేందుకు స్ట్రెచర్ కూడా ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే: ఖమ్మం జిల్లాకు చెందిన కాంతారావు అనే వ్యక్తికి గుండెపోటు వచ్చింది. దీంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన సాయంత్రం మృతి చెందారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంబులెన్స్ వరకు తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ ఇప్పించాలని అక్కడి సిబ్బందిని ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ సిబ్బంది కాంతారావు కుటుంబ సభ్యులను కనికరించలేదు. అడిగినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక కుటుంబ సభ్యులే కన్నీరుమున్నీరవుతూ మృతదేహాన్ని తమ చేతులపైనే మోసుకుంటూ బయట ఉన్న అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు.
సిబ్బందిపై విమర్శల వెల్లువ: సాంకేతికత ఎంత పెరిగినా కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా.. అత్యవసర సమయాల్లో రోగులకు, మృతుల బంధువులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎంజీఎం వైఫల్యం చెందుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవత్వం మరిచి వ్యవహరించిన సదరు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

