- విమానాశ్రయం, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన దిశగా కృషి
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
వరంగల్ ప్రతినిధి (తెలుగుప్రభ): వరంగల్, హనుమకొండ నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. వరంగల్ మామునూరు విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. శనివారం నాయిని విశాల్ ట్రస్ట్, క్రెడాయ్ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రై సిటీస్ హాఫ్ మారథాన్–2026 రెండో ఎడిషన్‌కు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి 5కే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని, క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే గ్రామీణ ప్రాంత యువతకు తగిన అవకాశాలు కల్పించి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.
‘ట్రై సిటీస్ హాఫ్ మారథాన్’ అభినందనీయం..
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ కార్యక్రమం అభినందనీయమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, శారీరక వ్యాయామం, క్రీడలు, ధ్యానం ద్వారా ఒత్తిడి, ఆందోళన, ఇతర అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చని చెప్పారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ కోసం నాలుగు నుంచి ఐదు వేల మంది పాల్గొనేందుకు నమోదు చేసుకోవడం అభినందనీయం అన్నారు.
క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే ఉద్దేశ్యం..
యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంచడం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే ఈ మారథాన్ ప్రధాన ఉద్దేశమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి కార్యక్రమానికి మరింత స్పందన లభించడం సంతోషకరమన్నారు. మారథాన్ విజయానికి సహకరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, క్రెడాయ్ ప్రతినిధులు, స్పాన్సర్లు, నిర్వాహకులు, క్రీడాకారులు, యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి..
క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. యువతలో పెరుగుతున్న ఒత్తిడి, ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ శ్రీగోదా రెడ్డిలను అభినందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, మారథాన్ నిర్వాహకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రన్నర్లు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




