HIV Positive Blood Injected: ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయడం ఇష్టం లేక కన్న కూతురికి హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కిస్తాడు తండ్రి. ఈ వాక్యం చూడగానే ఎవరికైనా రాజు వెడ్స్ రాంబాయి సినిమా గుర్తొస్తుంది. ప్రేమించిన వాడిన మరిచిపోవడం లేదనే కోపం, తాను చూసిన సంబంధం చేసుకోవడం లేదనే ఆక్రోశంతో కూతురిని ఒకేసారి చంపలేక.. ఇలా నరకయాతన అనుభవించేలా చేస్తాడు. అయితే ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయని.. బయట జరగవని ఫిక్స్ అయిపోతాం. కానీ ఇలాంటి సంఘటనే నిజ జీవితంలోనూ జరిగింది. కానీ ఇక్కడ విలన్ తండ్రి కాదు.. ప్రేమికుడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: https://teluguprabha.net/cinema-news/jr-ntr-drastic-change-for-dragon-raises-fans-concerns/
హైదరాబాద్‌లోని పోచారం ఐటీకారిడార్ పీఎస్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో యువతికి ఓ యువకుడు హెచ్‌ఐవీ ఉన్న రక్తాన్ని ఎక్కించాడు.
నిందితుడు మనోహర్‌తో బాధిత యువతికి వివాహం నిశ్చయం కాగా.. మరికొద్ది రోజుల్లో పెళ్లి కావాల్సి ఉంది. అయితే మనోహర్‌కి హెచ్‌ఐవీ ఉందని తెలియడంతో యువతితో పాటు కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో కోపం పెంచుకున్న మనోహర్.. తనకు కాబోయే భార్య ఎవరికీ దక్కకూడదనే కోపంతో దారుణమైన ప్లాన్ వేశాడు.
Also Read: https://teluguprabha.net/cinema-news/actress-poorna-welcome-baby-girl-shared-emotional-post/
ముందుగా ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడి చేశాడు. తర్వాత తన వద్ద సిద్ధంగా ఉన్న హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తాన్ని సిరంజితో ఆమె శరీరంలోకి ఎక్కించాడు. యువతి అరుపులు వేయడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.
భయాందోళనకు గురైన యువతి వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్య పరీక్షలు చేయించి ముందస్తు జాగ్రత్తగా యాంటీ రిట్రోవైరల్ థెరపీ చికిత్స ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. బాధితురాలు, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మనోహర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

