యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 5 (తెలుగు ప్రభ): సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెరువు మహిళా సర్పంచ్ భర్త జోక్యాన్ని అరికట్టాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
గ్రామసభలో సమస్యలను ప్రశ్నిస్తున్న ప్రజలపై సర్పంచ్ భర్త దుర్భాషలాడుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. గ్రామసభలను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ధర్నాలో సీపీఐ జిల్లా నాయకుడు సుర్వి నరసింహగౌడ్, బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఏర్పుల రాజేష్, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాత్క శేఖర్‌యాదవ్, బీఎస్పీ జిల్లా కార్యదర్శి ఏర్పుల సురేష్, సీపీఎం మండల నాయకులు గుండు జంగయ్య, గంగాదేవి బిక్షపతి, అఖిలపక్ష నాయకులు, మాజీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

