హైదరాబాద్ (తెలుగుప్రభ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది పాలన కాదని.. ప్రజా పీడన అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారు సర్వభ్రష్టంగా మారిందని, వెయ్యి రోజుల పాలనలో అన్నిరంగాల్లోనూ వైఫల్యమే మిగిలిందని విమర్శించారు. ఇచ్చిన హామీలన్నీ మోసాలేనని, పాలనంతా అరాచకంగా మారిందని మండిపడ్డారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ రూపొందించిన చార్జ్‌షీట్‌ను బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ విడుదల చేశారు. ప్రభుత్వ పథకాల్లో చోటుచేసుకున్నట్లు పేర్కొన్న అక్రమాలు, వైఫల్యాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శనికి వెయ్యి రోజులు పూర్తయ్యాయని, ప్రజలపై కాంగ్రెస్ దండయాత్ర ప్రారంభమై సరిగ్గా వెయ్యి రోజులు అయిందని వ్యాఖ్యానించారు. ఏ రంగాన్ని చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్ అయిందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ‘అభయహస్తం’ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని కేటీఆర్ ఆరోపించారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వెయ్యి రోజుల పాలనపై రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్‌వాడీలు, మహిళలు, కులవృత్తుల వారు సహా అన్ని వర్గాల ప్రజల్లో ఆగ్రహం నెలకొందన్నారు. అందుకే వివిధ వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నాయని పేర్కొన్నారు.
అజ్ఞానం.. అబద్ధం.. అరాచకం.. అవినీతి
కాంగ్రెస్ పాలనలో అజ్ఞానం, అబద్ధం, అరాచకం, అవినీతి నాలుగు తలల నాగుపాము మాదిరిగా విరుచుకుపడుతున్నాయని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి ఆడబిడ్డల వరకు, నిరుద్యోగులు, విద్యార్థులు, సబ్బండ వర్గాలు, కులవృత్తుల వరకు అందరూ అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని, లాటీలు, లూటీలు, నేరాలు, ఘోరాలే కనిపిస్తున్నాయని విమర్శించారు. కనీసం వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో ఉండి తమ గొప్పలు చెప్పుకుంటారని భావిస్తే.. ఢిల్లీకి వెళ్లి అవినీతి సొమ్ముల వాటాల పంపిణీపై పంచాయితీ పెట్టుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి గులాముగా మారిందని, రాష్ట్ర స్వతంత్రతను ఢిల్లీకి తాకట్టు పెట్టిందని విమర్శించారు. ప్రజలకు ఒక్క రూపాయి ప్రయోజనం కల్పించకపోయినా రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు.
అసమర్థత ప్రో మాక్స్.. అవినీతి అల్ట్రా మాక్స్
గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సున్నాలు వేసి.. వాటికే రిబ్బన్ కటింగ్‌లు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మంత్రివర్గంలో కీచులాటలు, తన్నులాటలు సాగుతున్నాయని విమర్శించారు. జెన్‌జీ భాషలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను చెప్పాలంటే.. ‘అసమర్థత ప్రో మాక్స్, అవినీతి అల్ట్రా మాక్స్, అరాచకం ఐమాక్స్’ అని అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా వారం రోజుల ఆందోళన కార్యక్రమాలను ప్రకటించామని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని చెప్పారు. భవిష్యత్తులోనూ విస్తృత కార్యాచరణతో ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

