Narahari Rao: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాకలోని నరహరిరావు నివాసంతో పాటు మరో 11 ప్రాంతాల్లో మంగళవారం ఏసీబీ బృందాలు ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.
రూ. 100 కోట్లకు పైనే అక్రమ ఆస్తులు: ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్రమాస్తుల విలువ రూ. 13.05 కోట్లు పైన ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వాటి బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ. 100 కోట్లకు పైనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నరహరిరావుకు చెందిన స్థిరాస్తులన్నీ హైదరాబాద్ శివార్లలోని అత్యంత డిమాండ్ ఉన్న ప్రముఖ ప్రాంతాల్లో ఉండటంతో మార్కెట్ పరంగా వాటి విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also read-ACB Raids: ఏసీబీ వలలో సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి.. కళ్లు బైర్లు కమ్మేలా అక్రమాస్తులు..!
1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి: నరహరి ఇంట్లో రూ. 1.54 కోట్ల నగదు, రూ.5.04 కోట్ల విలువ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాలో రూ.2.29 కోట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు, భార్య పేరున రెండు బ్యాంకు లాకర్లు, కారు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడలో ఓ అపార్ట్‌మెంట్ ఉన్నట్లు తేలింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టాడని పక్కా సమాచారం ఉండడంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేసి నరహరిరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం సోదాల అనంతరం నరహరిరావును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. బుధవారం ఉదయం ఆయనను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

