HomeTop StoriesGreen Card: గ్రీన్‌కార్డ్ కోసం 179 ఏళ్ల నిరీక్షణ.. ఎన్‌ఎఫ్‌ఏపీ అధ్యయనంలో సంచలన విషయాలు

Green Card: గ్రీన్‌కార్డ్ కోసం 179 ఏళ్ల నిరీక్షణ.. ఎన్‌ఎఫ్‌ఏపీ అధ్యయనంలో సంచలన విషయాలు

వాషింగ్టన్/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2 (తెలుగుప్రభ): అమెరికాలో శాశ్వత నివాస అర్హత కలిగించే ‘గ్రీన్‌కార్డ్’ కోసం ఆశగా ఎదురుచూస్తున్న భారతీయ అత్యున్నత నైపుణ్య వృత్తి నిపుణులకు దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఉన్న దరఖాస్తుల వేగం, నిబంధనలను బట్టి చూస్తే జనవరి 2026 తర్వాత దరఖాస్తు చేసుకున్న భారతీయ ఉద్యోగులకు గ్రీన్‌కార్డ్ రావడానికి ఏకంగా 179 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ’ (ఎన్‌ఎఫ్‌ఏపీ) తమ అధ్యయనంలో సంచలన విషయాలను వెల్లడించింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంలో ఏటా విధించే సీలింగ్ పరిమితులు, దేశాల వారీగా ఉన్న కఠిన నిబంధనల వల్ల భారతీయులే అత్యధిక కాలం వేచి చూడాల్సి వస్తోంది.

- Advertisement -

12 లక్షలు దాటిన దరఖాస్తుల బ్యాక్‌లాగ్

డిసెంబర్ 2025 నాటికి ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్ దరఖాస్తుల బ్యాక్‌లాగ్ 12 లక్షలు దాటిపోయిందని నివేదిక స్పష్టం చేసింది. అందులో దాదాపు 10 లక్షల దరఖాస్తులు ఒక్క భారతదేశానికి చెందినవారే కావడం గమనార్హం. అంటే మొత్తం పెండింగ్ జాబితాలో 79 శాతం వాటా భారతీయ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులదే కావడం గమనార్హం. విసా కేటగిరీల వారీగా చూస్తే.. ఈబీ-2 విభాగానికి 179 ఏళ్లు, ఈబీ-3 కింద 38 ఏళ్లు, ఈబీ-1 కింద 5 ఏళ్ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చైనాకు చెందిన ఈబీ-2 నిపుణులు 25 ఏళ్లు, ఈబీ-3 దరఖాస్తుదారులు 7 ఏళ్లు మాత్రమే వేచి చూస్తుండగా, భారతీయులపైనే ఈ భారం దారుణంగా పడుతోంది.

శతాబ్దాల నిరీక్షణకు దారితీసిన ప్రధాన కారణాలు

1990లో అమెరికా కాంగ్రెస్ విధించిన చట్టబద్ధ నిబంధన ప్రకారం ఏటా ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్ కేటాయింపులను కేవలం 1,40,000 కు పరిమితం చేశారు. ఇందులో ప్రధాన ఉద్యోగితో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా ఉండటం వల్ల కార్పొరేట్ కంపెనీలు స్పాన్సర్ చేసే సంఖ్యకు, మంజూరయ్యే కార్డులకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడుతోంది.జనాభాతో సంబంధం లేకుండా ప్రతీ దేశానికి సమాన శాతంలో మాత్రమే కార్డులు ఇవ్వాలనే నిబంధన మరొక శాపంగా మారింది. దీనివల్ల వంద కోట్ల పైగా జనాభా ఉన్న భారత్, చైనాలకు ఇచ్చే కార్డుల సంఖ్య, కొన్ని లక్షల జనాభా మాత్రమే ఉండే ఐస్‌లాండ్, లక్సెంబర్గ్ వంటి చిన్న దేశాలకు కేటాయించే సంఖ్య ఒకేలా ఉంటోంది.

పెరిగిన దరఖాస్తుల కుప్ప

గత కొన్నేళ్లుగా దరఖాస్తులు ఏ రీతిన పెరిగిపోయాయో ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. 2016 లో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్‌) భారతీయుల కోసం 47,601 ఇబీ-2 పిటిషన్లను ఆమోదించగా, వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం సంఖ్య 98,594కి చేరింది. అయితే ఆ పూర్తి ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,407 మంది భారతీయులకు మాత్రమే ఇబీ-2 గ్రీన్‌కార్డులు దక్కాయి. ఫలితంగా ఆ ఒక్క ఏడాదిలోనే 90 వేల మందికి పైగా వెయిటింగ్ లిస్ట్‌లోకి నెట్టివేయబడ్డారు. ఆపై 2017, 2018 నాటి దరఖాస్తులు కూడా తోడవడంతో ఈ సంఖ్య రికార్డుస్థాయికి చేరింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News