18th BRICS Summit in New Delhi : ప్రపంచ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రం సంక్లిష్టంగా మారుతున్న వేళ.. అంతర్జాతీయ సమాజం దృష్టి యావత్తూ దేశ రాజధాని వైపు మళ్లింది. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొంటూ సరికొత్త ప్రగతి బాటకు శ్రీకారం చుట్టేందుకు వర్ధమాన దేశాల కూటమి భారత్ వేదికగా నడుం బిగించింది.
దిల్లీలోని ప్రఖ్యాత భారత్ మండపం వేదికగా 18వ ‘బ్రిక్స్’ (BRICS) శిఖరాగ్ర సమావేశం శనివారం ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు సాగే ఈ ఉన్నత స్థాయి సదస్సులో భారత్‌తో పాటు రష్యా, చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ సహా 21 దేశాలకు చెందిన ప్రతినిధులు, అధినేతలు పాలుపంచుకుంటున్నారు.
కీలక ఎజెండా: పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ వాణిజ్య వివాదాలు, పరస్పర పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికత బదిలీ, ఆహార-ఇంధన భద్రత, ప్రజారోగ్యం వంటి సున్నితమైన అంశాలపై నేతలు సుదీర్ఘంగా మంతనాలు జరపనున్నారు.
కళా సంస్కృతుల వేదిక ‘బ్రిక్స్ బజార్’: సదస్సు సందర్భంగా భారత్ మండపం సమీపంలోని నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియంలో ‘బ్రిక్స్ బజార్’ పేరుతో ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ‘క్రాఫ్టింగ్ కల్చర్, కనెక్టింగ్ పీపుల్’ ఇతివృత్తంతో ఈ నెల 15 వరకు కొనసాగే ఈ ప్రదర్శనను విదేశీ ప్రతినిధులు సందర్శించి సభ్య దేశాల హస్తకళల గొప్పతనాన్ని వీక్షించనున్నారు.

