4 thousand new jobs in Paytm: ఏఐ రాకతో అనేక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను సాగనంపుతుండగా.. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం మాత్రం ఇందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుంది. రాబోయే తొమ్మిది నెలల్లో దాదాపు 4 వేల మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. తమ వ్యాపార నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడంతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సరికొత్త సేవలను అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం పేటీఎంలో దాదాపు 40 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఈ కొత్త నియామకాలతో సిబ్బంది సంఖ్య మరో 10 శాతం పెరగనుంది. అయితే, వార్షిక పనితీరు సమీక్ష ఆధారంగా దాదాపు 1 శాతం మంది ఉద్యోగులను, అంటే దాదాపు 400 మందిని కంపెనీ తొలగిస్తోందని పేటీఎం ప్రతినిధి ఒకరు వివరించారు. గతేడాది జరిగిన భారీ లేఆఫ్స్ తర్వాత ఇప్పుడు మళ్లీ ఉద్యోగులను తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెండేళ్ల క్రితం ఆర్‌బీఐ పేటీఎం బ్యాంకింగ్ కార్యకలాపాలను రద్దు చేస్తూ కఠిన చర్యల తీసుకున్న అనంతరం.. కంపెనీ తన బిజినెస్ మోడల్‌ని పూర్తిగా మార్చుకుంటోంది. పేటీఎంకు ఉన్న కోట్లాది మంది రిజిస్టర్డ్ యూజర్లు కేవలం మనీ ట్రాన్స్‌ఫర్స్ కాకుండా, తమ యాప్ ద్వారా రుణాలు, పెట్టుబడులు ఇతర ఆర్థిక సేవలను కూడా ఉపయోగించుకునేలా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ శేఖర్ శర్మ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్స్‌తో పాటు ప్రొడక్ట్, టెక్నాలజీ, ఏఐ విభాగాలలో 2027 మార్చి వరకు ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగనుంది. గత రెండు నెలల్లోనే ఇప్పటికే 800 మందికి పైగా కొత్తవారిని చేర్చుకున్నామని, మిగిలిన 4 వేల మందిని తీసుకునే పనిలో ఉన్నామని కంపెనీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
Also Read: Clashes in PoK: పీవోకేలో పాక్ ఆర్మీ అరాచకం.. ఆందోళనకారులపై కాల్పులు.. 30 మందికి పైగా మృతి
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు..
గతంలో ఆర్‌బీఐ తీసుకున్న చర్యల వల్ల పేటీఎం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. చివరకు ఏప్రిల్ నెలలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్‌బీఐ రద్దు చేయడంతో ఆ విభాగం పూర్తిగా మూతపడింది. ఆ సమయంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న పేటీఎం ఏకంగా 4,500 మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది. ఆ బ్యాంకింగ్ విభాగంలో పనిచేసిన చాలా మందిని గత రెండేళ్లలో తొలగించగా, కొంతమందిని పేటీఎం గ్రూప్‌లోని ఇతర విభాగాల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు మిగిలి ఉన్న వందలాది మంది సిబ్బందిని కూడా తొలగించనున్నారు. అయినప్పటికీ, ఆ కష్టాలన్నింటినీ అధిగమించి పేటీఎం వరుసగా గత నాలుగు త్రైమాసికాల నుంచి లాభాలను నమోదు చేస్తూ మళ్లీ పుంజుకోవడం కాస్త ఊరటనిచ్చింది.

