Wardhannapet: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల పసికందుపై 50 ఏళ్ల వయసున్న వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పరారీలో నిందితుడు: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికకు నిందితుడు భాస్కర్ (50) మాయమాటలు చెప్పి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన ఘోరం గురించి భయంతో ఉన్న చిన్నారి ఇంటికి వెళ్లి ఏడుస్తూ తన తల్లికి అసలు విషయం చెప్పింది. దీంతో దిగ్భ్రాంతికి గురైన తల్లి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు భాస్కర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Also read-Tamil Nadu: చెల్లిన హత్య చేసిన అన్నా.. వెలుగులోకి సంచలన విషయాలు!
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నిందితుడు: ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు భాస్కర్ సాధారణ వ్యక్తి కాదని, ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా (హెచ్‌ఎం) పనిచేస్తున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. పసి ప్రాయపు చిన్నారిపై ఒక గురువు స్థానంలో ఉండి ఇలాంటి రాక్షస కృత్యానికి పాల్పడటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన ఉపాధ్యాయుడే ఇంతటి హేయమైన నేపధ్యానికి పాల్పడటంతో పాటు ఈ కేసును దారి మళ్లించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. నిందితుడికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని, కేసును నీరుగార్చాలని చూస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

