ACB raids: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎం కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెడ్‌హిల్స్‌లోని ఆయన నివాసంతో పాటు, ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో ఏసీబీ రంగంలోకి దిగింది. ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారం, నివాస స్థలాల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కిలోన్నర బంగారం స్వాధీనం: జలమండలి జీఎం ఇంట్లో కిలోన్నర బంగారం, 2.5 కిలోల వెండిని అధికారులు గుర్తించారు. వాటితో పాటు నగదు రూ. 1.10 కోట్లు ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా స్థిరాస్తుల రూపంలో హైదరాబాద్‌లో 6 ఓపెన్ ప్లాట్లు, ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలో 3 విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వీటితో పాటుగా నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల వ్యవసాయ భూమి సైతం ఉన్నట్లు తెలుస్తోంది. లభించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ ఆస్తుల విలువ మార్కెట్ ధరలో కోట్ల రూపాయల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితుడికి సంబంధించిన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. కేసు నమోదు చేసి తదుపరి విచారణను వేగవంతం చేశారు.
Also read-ACB Raids: జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు.. తెల్లవారుజాము నుంచే ముమ్మర తనిఖీలు!
ఉదయం 6 గంటలకే రంగంలోకి దిగిన ఏసీబీ: మల్లాపూర్ పరిధిలోని జలమండలి జీఎం కుమార్ సొంత నివాసంలో ఏసీబీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించాయి. తెల్లవారుజామున 6 గంటలకే ఏసీబీ అధికారులు కుమార్ ఇంటికి చేరుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎవరినీ బయటకు వెళ్లకుండా, లోపలికి రాకుండా ఆంక్షలు విధించారు. ఇంటి మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.

