* అక్టోబర్ 14న ‘చలో హైదరాబాద్’
* ఇందిరా పార్క్ వద్ద ఆదివాసీల మహాధర్నా.
కొత్తగూడ, (తెలుగు ప్రభ):ఆదివాసీల రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం, ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా ఆదివాసి సంఘాల జేఏసీ మరియు ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో అక్టోబర్ 14న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద “ఆదివాసీల ఆత్మఘోష మహాధర్నా” నిర్వహించనున్నట్లు తుడుందెబ్బ నాయకులు ప్రకటించారు. ఈ రోజు కొత్తగూడ మండల కేంద్రం లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు, సర్పంచ్ లు, ఆదివాసీ విద్యార్థి సంఘ నాయకులు కరపత్రం ఆవిష్కరణ చేశారు.
అనంతరం తుడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ…
చారిత్రక నేపథ్యం & ఆరోపణలు:
ఆదివాసీలు 200 సంవత్సరాలుగా బ్రిటిష్ పాలకులు మరియు కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడి, 1874లోనే ఏజెన్సీ ప్రాంత సాధనతో పాటు 1917 నాటికి భూములపై పూర్తి హక్కులను సాధించుకున్నారు. స్వాతంత్య్రానంతరం రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూళ్ల ద్వారా లభించిన రక్షణలకు అనుగుణంగా గిరిజనేతరుల వలసలను అరికట్టేందుకు 1/59, 1/70, LTR ( భూ బదలాయింపు నిషేధ చట్టం ) వడ్డీ వ్యాపార నిషేధ చట్టం (1960), పేసా చట్టం (1996), మరియు అటవీ హక్కుల గుర్తింపు చట్టం (2006) వంటి అనేక చట్టాలు అమలులోకి వచ్చాయి.
అయితే, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లోకి విచ్చలవిడిగా వలసలు పెరిగి, ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు దెబ్బతినడమే కాకుండా భూములు అక్రమంగా చేతులు మారుతున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు కల్పించేందుకు 2000 సంవత్సరంలో తెచ్చిన జీవో నంబర్ 03 ద్వారా సుమారు 10,000 ఉద్యోగాలు ఆదివాసీలకు దక్కాయి. కానీ, 1976లో లంబాడీలను ఎస్టీ జాబితాలో కలపడం, 1980ల నాటికి ఏజెన్సీకి వలసవచ్చిన వారు నకిలీ ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు పొందడంతో 29 శాఖల్లోని 90% ఉద్యోగాలు, ఐఏఎస్/ఐపీఎస్ ఉన్నత పదవులు, మరియు రాజకీయ అవకాశాలు లంబాడీల పరమయ్యాయని తుడుందెబ్బ ఆరోపించింది.
పోరాట ప్రధాన డిమాండ్లు:
* సుప్రీంకోర్టు కేసుపై కౌంటర్ పిటిషన్: 1/70 చట్టంపై గిరిజనేతరులు సుప్రీంకోర్టులో వేసిన కేసులో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఆదివాసీల పక్షాన బలమైన కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలి.
* ప్రత్యేక కమిషన్ ఏర్పాటు: షెడ్యూల్డ్ తెగల (ST) జాబితా నుండి లంబాడీలను తొలగించేందుకు తక్షణమే ప్రత్యేక కమిషన్ను నియమించాలి.
* కొత్త జీవో తీర్మానం: రద్దయిన జీవో నంబర్ 03 స్థానంలో ఆదివాసీ ఉద్యోగ భద్రత కోసం కొత్త జీవో తెచ్చేలా ఆదివాసి ఎమ్మెల్యేలు, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ (TAC) ద్వారా తక్షణమే తీర్మానం చేయాలి.
* పోడు భూములకు పట్టాలు: రిజర్వు ఫారెస్ట్ ఏరియాలో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న 8 లక్షల ఎకరాల పోడు భూములకు తక్షణమే హక్కు పత్రాలు (పట్టాలు) మంజూరు చేయాలి.
‘చలో హైదరాబాద్’ కు తుడుందెబ్బ పిలుపు:
అక్టోబర్ 14 ఉదయం 11:00 గంటలకు ఇందిరా పార్క్ వద్ద జరిగే ఈ మహాధర్నాకు కొత్తగూడ మండల కేంద్రంలోని అన్ని ఆదివాసి గూడేల దొర పటేళ్లు, ప్రజలు, విద్యార్థులు, యువతీ యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, ఆదివాసి ప్రజాప్రతినిధులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) పిలుపునిచ్చింది.
కార్యక్రమ వివరాలు:
* తేదీ: అక్టోబర్ 14
* సమయం: ఉదయం 11:00 గంటలకు
* వేదిక: ఇందిరా పార్క్, హైదరాబాద్
* నిర్వహణ: తుడుందెబ్బ&ఆదివాసీ సంఘాల జేఏసీ
కార్యక్రమం లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్క యాదగిరి, మల్లెల రాము,తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసం నాగేశ్వర్ రావు,తుడుం దెబ్బ సీనియర్ నాయకులు ఇర్ప రవి తుడుందెబ్బ మండల అధ్యక్షులు పూనేం సందీప్ కుమార్,తుడుందెబ్బ మండల ప్రధాన కార్యదర్శి మల్లెల సారయ్య, తుడుందెబ్బ మండల కమిటీ సభ్యులు ఈక సురేందర్, బొందిల్లా సందీప్,పొనక ప్రకాష్,చాట్ల బుచ్చయ్య, ఈసం శోభన్ బాబు,మద్దెల వంశీ,తాటి సుదర్శన్,మల్లెల భాగమ్మ సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షురాలు, దానసరి ముత్తయ్య సర్పంచ్ ఎదుళ్ల పల్లి, ఆదివాసీ విద్యార్థి సంఘా నాయకులు రేగా రాణదీప్,వాసం చరణ్,వజ్జ అభి,దబ్బకట్ల అజయ్ కుమార్,మల్లెల శివ కుమార్,అట్టం కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

