Adulteration in Diwali sweets? 5 steps to check purity: దీపావళి పండుగ అంటేనే టపాసుల మోత, దీపాలు, కొత్త బట్టలు, స్వీట్లు. ఈ పండుగను తీపి పదార్థాలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే, దీపావళి వచ్చిందంటే సీట్ల అమ్మకాలు జోరందుకుంటాయి. అయితే, కస్టమర్ల డిమాండ్‌ను ఆసరగా చేసుకొని కొంతమంది వ్యాపారులు మార్కెట్‌లో కల్తీ స్వీట్లను కూడా విక్రయిస్తున్నారు. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. ఇవి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసి, ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయి. అనంతరం కాలేయం, మూత్రపిండాల్లో సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే పండుగ వేళ కల్తీ స్వీట్ల జోలికి వెళ్లకుండా ప్రభుత్వ హాల్‌మార్క్ గల స్వీట్లనే కొనుగోలు చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి, ఈ కల్తీ స్వీట్లను ఎలా గుర్తించాలి? వీటిని గుర్తించేందుకు పాటించాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుందాం.
కల్తీ స్వీట్లను గుర్తించేందుకు చిట్కాలు..
స్వీట్ మెరుపును చెక్ చేసుకోవడం
స్వీట్లపై వెండి రేకు అతిగా మెరుస్తుంటే అది కల్తీ అల్యూమినియం రేకు అని గ్రహించాలి. అసలు వెండి రేకు తాకగానే అంటుకుని కరిగిపోతుంది. కానీ నకిలీ రేకు కొద్దిగా గట్టిగా ఉండి సులభంగా విడిపోదు. ఈ నకిలీ రేకు కిడ్నీలకు హాని కలిగిస్తుంది.
కోవా నాణ్యత గుర్తించడం
కోవాతో చేసిన స్వీట్లలో కల్తీ ఎక్కువగా జరుగుతుంది. నిజమైన కోవాను వేలితో రుద్దితే కొద్దిగా జిడ్డుగా ఉండి పాల సువాసన వస్తుంది. నకిలీ కోవా దుర్వాసనతో పాటు కొద్దిగా గరుకుగా లేదా రబ్బరులా అనిపించవచ్చు. కల్తీ కోవా తింటే కడుపునొప్పి, వాంతులు వచ్చే ప్రమాదం ఉంది.
రంగుతో నాణ్యత పట్టేయడం
స్వీట్ల రంగు చాలా ముదురుగా, అసహజంగా, కృత్రిమంగా ప్రకాశవంతంగా ఉంటే సింథటిక్ రంగులు కలిపినట్లు అనుమానించాలి. పసుపు, నారింజ, పింక్ రంగు స్వీట్లలో ఈ ప్రమాదం ఎక్కువ. చిన్న ముక్కను నీటిలో ముంచి చూడండి. రంగు కరిగితే కల్తీ ఉన్నట్లే.
వాసన, రుచితో గుర్తించడం
అసలైన స్వీట్లలో పాలు, నెయ్యి, కుంకుమపువ్వు వంటి పదార్థాల నుంచి వచ్చే తేలికపాటి సువాసన ఉంటుంది. స్వీట్లకు బలమైన, అసహజమైన వాసన ఉంటే ఆర్టిఫిషియల్ ఎసెన్స్‌లు కలిపినట్లు అర్థం. రుచి కూడా అతిగా తీయగా లేదా అసాధారణంగా అనిపిస్తే జాగ్రత్త వహించాలి.
స్వీట్‌షాపు పర్మిషన్లు చెక్ చేయడం
స్వీట్లు కొనేటప్పుడు స్వీట్ షాపు పేరు, గుర్తింపును తప్పకుండా తనిఖీ చేయాలి. ఆ దుకాణానికి FSSAI సర్టిఫికెట్ ఉందో లేదో చూసుకోవాలి. నమ్మకమైన బ్రాండ్ల నుంచి లేదా సుప్రసిద్ధ స్థానిక తయారీదారుల నుంచి మాత్రమే స్వీట్లు కొనడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.


