HomeTop StoriesAIADMK : కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు.. ఏఐడీఎంకే చీఫ్‌ పళనిస్వామి సంచలన లేఖ

AIADMK : కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు.. ఏఐడీఎంకే చీఫ్‌ పళనిస్వామి సంచలన లేఖ

AIADMK chief Palaniswami Key Comments: తమిళనాడు పాలిటిక్స్‌ క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు పొందకపోవడంతో సస్పెన్స్‌ నెలకొంది. అయితే, అత్యధిక సీట్లు పొందిన విజయ్‌ టీవీకే పార్టీ తమతో కలిసివచ్చే చిన్న పార్టీలతో చర్చలు జరుపుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది. అయితే, మద్ధతిచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనకడుగు వేస్తూ విజయ్‌కి ముచ్చెమటలు పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే డీఎంకే-ఏఐడీఎంకే జట్టు కట్టి అధికారంలో వస్తుందనే సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిణామాలు విజయ్‌కి తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే (AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి విజయ్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పారు. టీవీకే అధినేత విజయ్‌కు పరోక్షంగా లైన్ క్లియర్ చేస్తూ పళనిస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్న తరుణంలో కొత్త ప్రభుత్వానికి ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ నేడు (శనివారం) లేఖ విడుదల చేశారు. ఈ పరిణామం 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించి, మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న విజయ్ నేతృత్వంలోని ‘టీవీకే’ పార్టీకి పెద్ద ఊరటనిచ్చింది. తాము అధికార పీఠం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని పళనిస్వామి ఈ లేఖ ద్వారా స్పష్టం చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/vh-key-statement-on-pm-modi/

సీఎం రేసులో లేనన్న పళనిస్వామి..

గత కొన్ని రోజులుగా పళనిస్వామి మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు తెరవెనుక చక్రం తిప్పుతున్నారనే ప్రచారానికి ఆయన స్వయంగా తెరదించారు. “నేను ముఖ్యమంత్రి రేసులో లేను. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు మా పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు” అని పళనిస్వామి తేల్చిచెప్పారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ తాము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగానే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో.. కొత్తగా దూసుకొచ్చిన విజయ్ పార్టీ ‘టీవీకే’ను అధికారానికి దూరంగా ఉంచేందుకు దశాబ్దాల బద్ధశత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే చేతులు కలపబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగింది. ఒకవేళ అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తే.. బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు అధికార డీఎంకే సిద్ధపడిందని, దీని వెనుక బీజేపీ హస్తం కూడా ఉందనే వార్తలు తమిళనాట గుసగుసలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో.. డీఎంకే ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరిగింది.

Also read: https://teluguprabha.net/telangana/cm-revanth-plans-to-make-hyderabad-a-signal-free-city/

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌..!

అయితే, డీఎంకే ప్రతిపాదించిన ఈ విచిత్ర కూటమి ప్రయత్నాలకు ఆ పార్టీ మిత్రపక్షాలైన వామపక్షాలు (సీపీఐ, సీపీఎం), తోల్ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే (VCK) పార్టీలు గట్టి షాకిచ్చాయి. సిద్ధాంతపరంగా బద్ధశత్రువైన అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా వారికి మద్దతు ఇవ్వడాన్ని లెఫ్ట్, వీసీకే పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. డీఎంకే ప్రతిపాదనకు తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీల నేతలు ఖరాకండిగా చెప్పినట్లు సమాచారం. మిత్రపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, అలాగే డీఎంకేతో జతకడితే ప్రజాక్షేత్రంలో అభాసుపాలవుతామనే ఆందోళనతో అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల నుంచి పూర్తిగా వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలోనే పళనిస్వామి తాము సీఎం రేసులో లేమని, ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనే లేదని అధికారికంగా ప్రకటించారు. ఈ తాజా పరిణామాలతో తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే తరహాలో డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ కూడా ప్రకటించడం విజయ్‌కి భారీ ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News