AIADMK Split: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK) చీలిపోయింది. పార్టీ సీనియర్ నేతలైన రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగం, వేలుమణి నేతృత్వంలోని వర్గం.. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
పళనిస్వామిపై తీవ్ర ఆరోపణలు: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ చీఫ్ పళనిస్వామి.. బద్ధశత్రువైన డీఎంకే (DMK)తో పొత్తు పెట్టుకోవాలని భావించారని సీవీ షణ్ముగం తీవ్ర ఆరోపణలు చేశారు. 53 ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఉనికిని ఆయన ప్రమాదంలో పడేశారని అన్నారు. అన్నాడీఎంకేను పునరుద్ధరించడమే తమ లక్ష్యమని పేర్కొన్న షణ్ముగం వర్గం.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాతీర్పును గౌరవిస్తూ సీఎం విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. మా వర్గం ఎమ్మెల్యేలు త్వరలోనే ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసి అధికారికంగా మద్దతు పత్రం అందజేస్తామని సీవీ షణ్ముగం తెలిపారు.
Also read-Tamil Nadu: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మద్యం దుకాణాల మూసివేత!
అసెంబ్లీలో మారనున్న సమీకరణాలు: ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 సీట్లు సాధించింది. ఇప్పుడు షణ్ముగం వర్గం చీలిపోవడంతో పళనిస్వామి పట్టు కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. కొత్తగా ఏర్పాటైన టీవీకే ప్రభుత్వానికి ఈ పరిణామం మరింత బలాన్ని చేకూర్చగా.. అన్నాడీఎంకే భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దశాబ్దాల చరిత్ర ఉన్న అన్నాడీఎంకేలో ఈ చీలిక తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

