Air India: విమాన ఇంధన ధరలు పెరుగడంతో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్చులను నియంత్రించుకునే క్రమంలో భాగంగా అంతర్జాతీయ మార్గాల్లో పెద్ద ఎత్తున విమాన సర్వీసులను తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది. దాదాపు 100 విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
తక్షణమే అమల్లోకి రానున్న విమాన సర్వీసుల నిలిపివేత: ఈ సర్వీసుల రద్దు నిర్ణయం తక్షణమే అమల్లోకి రానున్నట్లు విమానయాన సంస్థ పేర్కొంది. రాబోయే మూడు నెలల పాటు ఈ కోతలు కొనసాగుతాయని సంస్థ స్పష్టం చేసింది. ముఖ్యంగా భారత్ నుండి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులపై ఈ ప్రభావం పడనుంది. ముఖ్యంగా దిల్లీ నుంచి షికాగో, నెవార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో. టొరంటో, పారిస్, షాంఘై నగరాలకు బయలుదేరే పలు అంతర్జాతీయ సర్వీసుల్లో ఎయిర్ ఇండియా కోత విధించింది. ఈ నిర్ణయంతో వేసవి కాలంలో విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు.

