Rains in AP: ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) కీలక హెచ్చరిక జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. దీని ప్రభావంతో మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఉండటంతో పాటు.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఈ జిల్లాల్లో వర్ష సూచన: రాష్ట్రంలోని కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైనా అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సైతం వర్షాలు పడనున్నాయి. రాయలసీమలోని శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతిలో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వడగాలులు వీచే అవకాశం!: ఒకవైపు వర్ష సూచన ఉండగా మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగనుంది. ముఖ్యంగా పోలవరం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మారుతున్న ఈ వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read- Tamil Nadu: తమిళనాడు సీఎం పీఠంపై వీడని ఉత్కంఠ.. హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
ప్రజలకు కీలక సూచనలు: పిడుగుల ముప్పు పొంచి ఉన్నందున విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించింది. ఉరుములు మొదలైనప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలి. వర్షం పడే సమయంలో పొరపాటున కూడా చెట్ల కింద నిలబడకూడదు. పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ స్తంభాలు, ఇనుప తీగలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

