Jai Anmol Ambani: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీతో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్(RHFL), దాని మాజీ డైరెక్టర్లపై తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు.
ప్రధానంగా RHFL రూ.228.06 కోట్లు మోసం చేసినట్లు సీబీఐ గుర్తించింది. వ్యాపార అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ రూ.450 కోట్ల క్రెడిట్ సదుపాయాన్ని మంజూరు చేయగా.. ఈ నిధులను కంపెనీ దుర్వినియోగం చేసిందని, ఉద్దేశించిన లక్ష్యాలకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించిందని సీబీఐ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఇందులో జై అన్మోల్ అంబానీతో పాటు RHFL మాజీ డైరెక్టర్ రవీంద్ర శరద్ సుధాకర్ ను కూడా నిందితులుగా చేర్చింది సీబీఐ. ఖాతాలను తారుమారు చేయడం, క్రిమినల్ నమ్మక ద్రోహం, నిధులను దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలు వీరిపై మోపబడ్డాయి.
also read Indonesia: ఇండొనేషియాలో ఘోర అగ్ని ప్రమాదం.. గర్భిణీతో సహా 20 మంది మృతి
అయితే ఫోరెన్సిక్ ఆడిట్‌లో కీలక విషయాలు అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 2016 నుండి జూన్ 2019 వరకు జరిగిన లావాదేవీలపై గ్రాంట్ థోర్న్టన్ నిర్వహించిన ఆడిట్‌లో ఈ భారీ నిధుల మళ్లింపు, ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి. కంపెనీ రుణాల తిరిగి చెల్లింపు షెడ్యూల్‌ను పాటించలేదని, వడ్డీ చెల్లింపుల్లో జాప్యం చేసిందని, రుణ నిబంధనల ప్రకారం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాలను నిర్దేశిత బ్యాంకు ఖాతాకు మళ్లించడంలో విఫలమైందని ఆడిట్ నివేదిక స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబర్ 30, 2019న బ్యాంకు ఈ ఖాతాను నిరర్థక ఆస్తి (NPA)గా ప్రకటించింది బ్యాంక్.
నిందితులు అకౌంటింగ్ ఎంట్రీలను తారుమారు చేసి, అనుబంధ సంస్థలకు నిధులను దారి మళ్లించి, స్వాహా చేశారని యూనియన్ బ్యాంక్ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జై అన్మోల్ అంబానీపై నేరుగా సీబీఐ కేసు నమోదు చేయడం ఇది మొదటిసారి. అయితే ఇంతకుముందు యెస్ బ్యాంక్–రిలయన్స్ క్యాపిటల్ లావాదేవీలకు సంబంధించిన దర్యాప్తుల్లో అనిల్ అంబానీతో పాటు జై అన్మోల్ అంబానీ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అప్పట్లో రిలయన్స్ నిప్పన్ మ్యూచువల్ ఫండ్‌లో నిర్ణయాలపై ఆయన ప్రభావం చూపారని ఆరోపణలు ఉన్నాయి. మెుత్తానికి రుణాల డిఫాల్ట్‌లు, అనేక నియంత్రణ సంస్థల విచారణలతో సతమతమవుతున్న అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌కు ఈ కొత్త సీబీఐ కేసు మరింత సంక్లిష్టతను పెంచింది.

