CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ దిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని మూడో దఫా ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దిల్లీలో ఎన్డీఏ కూటమి పార్టీల కీలక సమావేశం జరగనుంది. జూన్ 10న ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ ఉన్నత స్థాయి భేటీకి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో భాగస్వాములు కానున్నారు.
ఎన్డీఏ భేటీలో ప్రధానాంశాలు ఇవే: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోని పాలనా తీరుతెన్నులపై సమీక్ష జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను రాష్ట్రాల్లో సమర్థవంతంగా అమలు చేయడం, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంపై చర్చించనున్నారు. అయితే జూన్ 15 తర్వాత కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్డీఏ ముఖ్య నేతల భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Also read-Land Records : భూకబ్జాలకు చెక్.. బ్లాక్‌చెయిన్‌తో భద్రత
ఏపీ ప్రయోజనాలపై చర్చించనున్న సీఎం, డిప్యూటీ సీఎం: ఈ పర్యటనలో భాగంగా ఏపీ ప్రయోజనాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి పెట్టనున్నారు.కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బిల్లుల విడుదల, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన నిధులు వంటి అంశాలను ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన కూటమి నేతలు.. ఈ పర్యటన ద్వారా కేంద్రం నుండి మరిన్ని రాయితీలు, నిధులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

