AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం దిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో హస్తినకు చేరుకున్న ఆయన.. రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, అంతర్జాతీయ ప్రతినిధులతో వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
నేడు అమిత్ షాతో కీలక భేటీ: ఇవాళ ఉదయం 11:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్‌తో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతితో పాటు నిధుల విడుదలపై సమీక్షించనున్నారు.
Also read-Rain alert: ఏపీకి పొంచి ఉన్న ముప్పు… హెచ్చరికలు జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ!
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహకారంపై చర్చించనున్నారు. సాయంత్రం జరగనున్న సీఐఐ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొని.. పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై కీలక ప్రసంగం చేస్తారు.
Also read-PM Modi: చంద్రబాబు, పవన్‌ల నివాసాలకు ప్రధాని మోదీ.. ఈ క్షణాలు చిరస్మరణీయమంటూ ఇరు నేతల ట్వీట్
రేపు అసోంకు సీఎం చంద్రబాబు: సోమవారం రాత్రి దిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు.. మంగళవారం ఉదయం నేరుగా అసోం రాష్ట్రానికి వెళ్లనున్నారు. అక్కడ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు నేరుగా విజయవాడకు చేరుకుంటారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

