HomeTop StoriesPawan Kalyan: వీరాభిమాని దీనస్థితిని చూసి ఎమోషనల్‌ అయిన పవన్ కల్యాణ్‌

Pawan Kalyan: వీరాభిమాని దీనస్థితిని చూసి ఎమోషనల్‌ అయిన పవన్ కల్యాణ్‌

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ.. మంచానికే పరిమితమైన 17 ఏళ్ల వీరాభిమానిని వరంగల్‌కు వెళ్లి పరామర్శించారు. పవన్‌ కల్యాణ్‌ను కలవాలనే తన స్వప్నం నెరవేరడంతో నిరంజన్‌ ఆనందం వ్యక్తం చేశాడు. పవన్‌ను చూసి ఎమోషనల్‌ అయ్యాడు. దీంతో పవన్‌ కల్యాణ్‌ చలించిపోయారు.

- Advertisement -

నుదిటిపై ముద్దుపెట్టి ధైర్యం చెప్పిన పవన్‌: అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్న నిరంజన్‌.. పవన్‌ కల్యాణ్‌ను కలవాలని కోరుకున్నాడు. ఈ విషయాన్ని వరంగల్‌ జనసేన నాయకులు ఏపీ డిప్యూటీ సీఎంకు తేలియజేశారు. వెంటనే స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు నేరుగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. నిరంజన్ దీనస్థితిని చూసి పవన్ చలించిపోయారు. మంచంపై ఉన్న నిరంజన్ పక్కనే కూర్చుని.. ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదిటిపై ముద్దుపెట్టి ధైర్యం చెప్పారు. చిన్నప్పటి నుండి తనపై ఉన్న అభిమానాన్ని నిరంజన్ వివరించగా పవన్ ఎమోషనల్‌ అయ్యారు. తనను స్థానికులంతా ‘చోటా గబ్బర్ సింగ్’ అని పిలుస్తారని నిరంజన్ చెప్పడంతో వాతావరణం కాస్త తేలికపడింది.

నిరంజన్‌ కుటుంబానికి భరోసా: నిరంజన్ తల్లిదండ్రులు రాంగోపాల్, మానసలతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని, వైద్య విధానాలను పవన్ అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని భరోసా ఇస్తూ.. తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రాన్ని నిరంజన్‌కు కప్పి.. తీర్థప్రసాదాలను అందించారు. నిరంజన్‌ కుటుంబ ఆర్థిక ఇబ్బందులను గమనించిన పవన్.. వారి జీవనోపాధి కోసం ప్రత్యేకంగా ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయించాలని తెలంగాణ జనసేన నాయకులను ఆదేశించారు.

భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు: నిరంజన్ పరామర్శ అనంతరం పవన్ కల్యాణ్ నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. నిరంజన్ ఆరోగ్యం కుదుటపడాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజలు పూర్తి చేసిన భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమను నిరంజన్ కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ నాయకులు రాధారం రాజలింగం, ఆర్.కె. సాగర్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ప్రోటోకాల్ పక్కనబెట్టి ఓ సాధారణ అభిమాని ఇంటికి వచ్చి పవన్‌ చూపిన ఆత్మీయత స్థానికులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News