Krishna River Pollution: పవిత్ర గోదావరి, కృష్ణా నదులు కాలుష్య కోరల్లో చిక్కుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. “మా తెలుగు తల్లి గేయంలో గోదావరి, కృష్ణమ్మల గలగలలు అని ఎంతో గర్వంగా పాడుకుంటాం. కానీ.. ప్రస్తుత దుస్థితి చూస్తుంటే గోదావరి, కృష్ణమ్మ వెలవెల అని పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది” అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్వయంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం: తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ రెండో రోజు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వెంకటనగరం సమీపంలో ఆంధ్రా పేపర్ మిల్స్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు నేరుగా గోదావరి నదిలో కలుస్తున్న ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. నదీ జలాలు కలుషితమవుతున్న తీరుపై అధికారులను నిలదీశారు. కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also read-Pawan kalyan: ‘రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదు.. జనసేనపై రాళ్లు వేద్దామనుకుంటే..’
నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు: గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. కాలుష్య నియంత్రణ, వ్యర్థాల విడుదలపై ఈ టాస్క్‌ఫోర్స్ నిరంతరం నిఘా ఉంచుతుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా నదిలోకి విడుదలవుతున్న కలుషిత నీటి నమూనాలను వెంటనే సేకరించి.. పరీక్షలకు పంపాలని అధికారులను ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి నదులను కలుషితం చేసే పరిశ్రమలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. నదుల పరిరక్షణ కోసం పవన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
“దశాబ్దాలుగా నదులను వేధిస్తున్న కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే పట్టుదలతో మా ప్రభుత్వం ఉంది. పవిత్ర గోదావరి నదిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు.” – పవన్ కల్యాణ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి

