Orion capsule: ఆర్టెమిస్-2 విజయవంతంగా చంద్రుడిని చుట్టేసి భూమిని చేరింది. పసిఫిక్ మహాసముద్రంలో ఒరాయన్ క్యాప్సుల్ దిగింది. అందులోని నలుగురు వ్యోమగాములు.. పది రోజుల యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. అర్ధశతాబ్దం తర్వాత చంద్రుడి చెంతకి వెళ్లివచ్చిన వ్యోమగాములుగా వారు రికార్డు సృష్టించారు. వీరి ఒరాయన్ వ్యోమనౌక.. జాబిల్లి వెనుక భాగానికి వెళ్లి ఆ తర్వాత యూ టర్న్ తీసుకొని పుడమికి చేరుకుంది.
పది రోజుల యాత్ర విజయవంతం: ఆర్టెమిస్-2 యాత్రలో భాగంగా అమెరికాకు చెందిన రీడ్ వైస్‌మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడా వ్యోమగామి జెరెమీ హాన్సన్‌లు ఈ నెల 1న భూమి నుంచి బయల్దేరారు. వీరు భూమి నుంచి 4,06,771 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇది 1970లో అపోలో-13 వ్యోమగాములు వెళ్లిన దూరం కన్నా దాదాపు 6,600 కిలోమీటర్ల దూరం అధికమని నాసా పేర్కొంది.
Also read-CM Revanth Reddy: కాలమే సమాధానం చెబుతుంది.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం కౌంటర్!
ఒకే ఫ్రేమ్‌లో చందమామ, భూమి: చందమామను చుట్టి వచ్చే ప్రక్రియలో వ్యోమగాములు విస్తృతంగా పరిశీలనలు చేపట్టారు. తమ వద్ద ఉన్న శక్తిమంతమైన కెమెరాలతో జాబిల్లి మీదున్న ఇరవైకి పైగా లక్ష్యాలను క్లిక్‌మనిపించారు. అంతేకాకుండా ఒకే ఫ్రేమ్‌లో చందమామ, భూమిని ఫోటోతీశారు. ఇప్పటివరకూ ఫొటో తీయని ఓరియంటల్ బేసిన్ అనే బిలాన్ని సైతం తమ కెమెరాల్లో బంధించారు. చందమామను చుట్టివచ్చే క్రమంలో విశ్వంలో మానవులెవ్వరూ వెళ్లనంత దూరం ప్రయాణించిన ఆర్టెమిస్-2 ఈ రోజు ఉదయం తిరిగి భూమిని చేరింది.

