HomeTop StoriesAppointment : ఆపరేషన్‌ సిందూర్‌ వీరుడు.. ఇక అయోధ్య ఆలయ నిర్వాహకుడు

Appointment : ఆపరేషన్‌ సిందూర్‌ వీరుడు.. ఇక అయోధ్య ఆలయ నిర్వాహకుడు

Ayodhya Ram Temple First CEO Appointment : అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర పరిపాలనలో నవ శకానికి నాంది పడింది. నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే రామ మందిర నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే లక్ష్యంగా ట్రస్ట్ సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సంస్థాగత ప్రక్షాళనలో భాగంగా తొలిసారిగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) పదవిని సృష్టించి, ఆ గురుతర బాధ్యతలను భారత వైమానిక దళ మాజీ ఉన్నతాధికారికి అప్పగించింది.

- Advertisement -

సైనిక దక్షతకు పెద్దపీట : భారత వాయుసేనలో 38 ఏళ్లకు పైగా విశిష్ట సేవలందించిన రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌ జితేంద్ర మిశ్రాను ట్రస్ట్‌ తొలి సీఈఓగా నియమించింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన ‘సర్వోత్తమ్‌ యుద్ధ సేవా మెడల్‌’ గ్రహీత ఆలయ ఆర్థిక లావాదేవీలు, పరిపాలనా విభాగాలు, రోజువారీ భక్తుల సౌకర్యాలను సమర్థవంతంగా సమన్వయం చేసేందుకు ఆయనకు అత్యున్నత అధికారాలు కల్పించారు.

ఏఐ స్క్రీనింగ్‌తో పకడ్బందీ ఎంపిక : సీఈఓ నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగింది. రిటైర్డ్‌ జస్టిస్‌ ప్రమోద్‌ కోహ్లీ నేతృత్వంలోని సెర్చ్‌ కమిటీ పర్యవేక్షణలో ఏఐ సాంకేతికతతో కూడిన స్క్రీనింగ్ నిర్వహించారు.  దరఖాస్తు చేసుకున్న 5,585 మందిలో 600 మార్కుల ప్రాతిపదికన క్షుణ్ణంగా పరిశీలించి, తుది ముఖాముఖి ద్వారా మిశ్రాను ఎంపిక చేశారు.

కొత్త ట్రస్టీల రాక : సీఈఓతో పాటు ట్రస్ట్‌ నూతన ప్రధాన కార్యదర్శిగా గోవింద్‌ దేవ్‌ గిరి నియమితులయ్యారు. అలాగే మహేశ్‌ భగ్‌చంద్కా, మదన్‌మోహన్‌ పాండే, డాక్టర్‌ నిర్మలా యాదవ్‌లు నూతన ట్రస్టీలుగా బాధ్యతలు చేపట్టారు. సమగ్ర మార్పులతో రామ మందిర పాలనను మరింత పటిష్ఠం చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News