HomeTop StoriesPOCSO Case: బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు!

POCSO Case: బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు!

Bandi Bhagirath: పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మేడ్చల్ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా.. ఆయన 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు రాత్రి 12 గంటల సమయంలో అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ అరెస్టుకు ముందు శనివారం ఉదయం నుంచి హైడ్రామా నడిచింది.

- Advertisement -

లుకౌట్ నోటీసులు జారీ: ముందస్తు బెయిలు, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ భగీరథ్‌ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు భగీరథ్‌ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. నిందితుడి కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలించారు. భగీరథ్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కాల్ డేటా ఆధారంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడల్లోని అతని స్నేహితుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. కరీంనగర్‌లోని భగీరథ్ నివాసంతో పాటు అతని మేనమామ, భాజపా కార్యకర్తల ఇళ్లలోనూ వెతికినా ఫలితం లేకపోయింది.

బండి సంజయ్ నివాసంలో తనిఖీలు: గాలింపు చర్యల్లో భాగంగా పోలీసులు బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ నివాసానికి సైతం వెళ్లారు. అక్కడ గంటపాటు సోదాలు చేసినా భగీరథ్‌ లభించలేదు. సాయంత్రానికి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను అధికారులు అప్రమత్తం చేయడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also read-DK Aruna: అవన్నీ పగటి కలలే.. సీఎం రేవంత్‌పై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు

లొంగుబాటు ప్రకటన: పరిణామాలు వేగంగా మారడంతో శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టాన్ని గౌరవిస్తూ తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించినట్లు అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే.. పోలీస్ అకాడమీ (అప్పా జంక్షన్) సమీపంలో భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో భగీరథ్ ఇద్దరు న్యాయవాదులతో కలిసి పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

వైద్య పరీక్షల అనంతరం రిమాండ్‌కు: భగీరథ్‌ను పేట్‌బషీరాబాద్ ఠాణాకు తరలించగానే కేసు పర్యవేక్షణాధికారిణి, డీసీపీ రితిరాజ్‌, ఏసీపీ శంకర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టరు విజయ్‌వర్ధన్‌లు తదుపరి చర్యలు చేపట్టారు. నిందితుడికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. మేడ్చల్‌లోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో భారీ భద్రత నడుమ అర్ధరాత్రి చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నెల 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News