Bathukamma: తెలంగాణ నేల సమృద్ధికి, సంస్కృతికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ. ఆశ్వయుజ మాసంలో తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పూల ఉత్సవం కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా.. నేడు ప్రపంచ వేదికలపై సస్కృతిక పతాకను ఎగురవేస్తూ “విశ్వవ్యాప్తమైన పూల సంబరం”గా రూపాంతరం చెందింది.
ప్రకృతిని ఆరాధించే ఏకైక పండుగ..
సాధారణంగా దేవుళ్లను విగ్రహాల రూపంలో పూజించడం చూస్తుంటాం. కానీ మానవాళికి జీవనాధారమైన ప్రకృతిని, పూలను, నీటిని అమ్మవారి రూపంగా ఆరాధించే ఏకైక పండుగ బతుకమ్మ. పూల అలంకరణ: తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, కటకట్ల పూలను త్రికోణాకారంలో పేర్చి ‘మహా గౌరి’గా ఆరాధిస్తారు. తొమ్మిదో రోజు పండుగ ముగిసాక బతుకమ్మలను సమీప చెరువుల్లో నిమజ్జనం చేయడం వెనుక జలాశయాలను పరిశుభ్రంగా ఉంచే శాస్త్రీయ దృక్పథం కూడా దాగి ఉంది.
సామాజిక ఐక్యతకు నిలువుటద్దం..
బతుకమ్మ పండుగ సామాజిక సమరసతకు నిదర్శనం. కులమతాలకు అతీతంగా ఊర్లోని ఆడపడుచులందరూ ఒకచోట చేరి, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. చీకటి పడే సమయంలో ఊరేగింపుగా వెళ్తూ ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకుంటారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో” అంటూ సాగే జానపద గేయాలు తెలంగాణ సంస్కృతీ వైభవాన్ని ప్రతిధ్వనింపజేస్తాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఈ పండుగకు అంతర్జాతీయ ప్రాచుర్యం లభించింది. నేడు విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు తమ మూలాలను మర్చిపోకుండా ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు.

