Bay of Bengal Low Pressure: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్ నినో ప్రభావంతో ఈ వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వానలు లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో వినాయకచవితి సమయంలో నిమజ్జనానికి నీటి లభ్యతపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ వాతావరణ శాఖ వర్షాలకు సంబంధించి తాజా అంచనాలను వెల్లడించింది. శనివారం నుంచి రానున్న వారం రోజులలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలతో పాటు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో శనివారం ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి వానలు పడవచ్చని పేర్కొన్నారు.
శ్రీకాకుళంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని అంచనా. వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో వర్షాలతో పాటు చెదురుమదురు గాలులు వీచే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో అమీన్‌పూర్, దుండిగల్, బాచుపల్లి, నిజాంపేట్, మల్లంపేట్, బొల్లారం, కుత్బుల్లాపూర్, గాజులరామారం, జీడిమెట్ల, కూకట్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, బాలానగర్, అల్వాల్, మల్కాజిగిరి, యాప్రాల్, మేడ్చల్ పరిసరాల్లో రానున్న గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: Vinayaka Idol: వినాకయ విగ్రహాన్ని కొనుగోలు చేసే ముందు ఈ నియమాలు పాటిస్తున్నారా

