Bihar CM Nitish Kumar life journey: బిహార్ రాజకీయాలపై నితీశ్ కుమార్ ప్రభావం చాలా బలమైనది. ఆయన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేయడంతో రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. లాలూ, రబ్రీ దేవి పాలనలో ఉన్న ‘జంగిల్ రాజ్’ (అరాచకత్వం)కు భిన్నంగా.. సుపరిపరిపాలనతో కూడిన అభివృద్ధికి నితీశ్ కుమార్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ‘సుశాసన్ బాబు’ (సుపరిపాలనా నాయకుడు) అనే ఇమేజ్‌ను సంపాదించారు. బీజేపీ (ఎన్‌డీఎ), ఆర్‌జేడీ (మహాకూటమి) వంటి ప్రధాన కూటములతో తరచుగా పొత్తులు మార్చినా.. బిహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ ఒక అనివార్య శక్తిగా ఎదిగారు. “ఎవరు నితీశ్‌తో ఉంటారో.. వారే గెలుస్తారు” అనే అభిప్రాయాన్ని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బలంగా నాటారు. రాజకీయ చతురతతో తాను ఏ కూటమిలో ఉంటే ఆ కూటమికి ఓట్లు బదిలీ చేయగలిగే సామర్థ్యం పొందారు. ఆ క్రమంలోనే బీజేపీతో పాటు బిహార్ ప్రజలు మరోసారి నితీశ్ వెంటే ఉన్నారు. దీంతో 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి.. సరికొత్త చరిత్రను లిఖించారు. అయితే తన మార్కు పాలనతో ఇదివరకులాగే బిహార్‌ను ప్రగతిపథంలో నడిపిస్తారా? లేదా? సంకీర్ణాల బందీలో చిక్కుకుని అస్థిర రాజకీయ నాయకుడిగా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందా.. తెలుసుకుందాం!
కత్తికి రెండు వైపులా పదును: బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభావం ఒక కత్తికి రెండు వైపులా పదును లాంటిది. ఒకవైపు గొప్ప సంస్కరణల వాదిగా కీర్తి పొందితే.. మరోవైపు అస్థిర రాజకీయ నాయకుడిగా విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా బిహార్ రాజకీయాలు నితీశ్ కుమార్ అనే కేంద్ర బిందువు చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. అదే అతని చరిష్మా. తాను నిజాయితీతో బిహారీలకు చేసిన సేవ.. రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించిన విధానమే తనకు మరోసారి పట్టం కట్టేలా చేశాయి. తొలిసారిగా 2005లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పగలు రాత్రి తేడా లేకుండా రాష్ట్రం కోసం పూర్తి నిబద్ధతతో కష్టపడి పనిచేశాడనే పేరు సంపాదించారు. అందుకే నితీశ్ కుమార్ వరుసగా మూడోసారి, మొత్తంగా పదోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది చాలా అరుదైన విషయం. బిహార్ చరిత్రలో దాదాపు ఎవరూ ఇంతకాలం వరుసగా పాలించలేదనేది నగ్నసత్యం. బిహార్‌లో అతను తీసుకువచ్చిన మార్పులే మరోసారి నితీశ్‌కు పట్టం కట్టేలా చేశాయి.
నిజాయితీతో కూడిన పనితనం: 2005 నుంచి అహర్నిశలు నితీశ్ కష్టపడి పనిచేశారు. అంతేకాకుండా తన ప్రభుత్వం.. అందరినీ కలుపుకొని పోయే విధానాన్ని రూపొందించారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేశారు. సమాజహితం కోసమే తన తాపత్రయం తప్పా, తన కుటుంబం కోసం కాదని పలుసభల్లో చెబుతూ.. ఆర్జేడీ అధినేతపై పరోక్షంగా విమర్శలు గుప్పించేవారు.
2005 నుంచే మొదలైన మార్పు: నితీశ్ కుమార్ అధికారం చేపట్టినప్పుడు బిహార్‌లో శాంతిభద్రతలు నశించి, దెబ్బతిన్న రోడ్లతో అభివృద్ధికి చాలా దూరంగా ఉంది. అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన నితీశ్ కుమార్ తనదైన వ్యూహాలతో బిహార్‌ను అభివృద్ధి వైపు నడిపారు. అనేక సంస్కరణలను తీసుకువచ్చారు. ముఖ్యంగా రోడ్లు, విద్యుదీకరణ మెరుగుపడటంలో నితీశ్ కృషి ప్రశంసనీయం. బిహార్‌లో చీకటి పడ్డాక ఎవరూ బయటకు రారు.. అనే భయానక వాతావరణం నుంచి గ్రామాలను పట్టణాలతో కలిపే రహదారులను నిర్మించారు. దీంతో ప్రజల్లో అభద్రతా భావాన్ని పారద్రోలారు. నితీశ్ కుమార్ బిహార్‌లో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించే ప్రయత్నం సైతం చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పలు ఇండస్ట్రియల్ పార్క్‌లను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలను కల్పించారు.
సంక్షేమం, మహిళా సాధికారత: నితీశ్ కుమార్ విజయాల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలక పాత్ర పోషించారు. పాఠశాల బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అంతేకాకుండా మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం వంటి పథకాల ద్వారా మహిళా ఓటర్లలో నితీశ్ బలమైన ముద్ర వేశారు. 10వ సారి ఆయనే ముఖ్యమంత్రి అయినందున ఈ పథకాలు కొనసాగడంతో పాటు మరింత పటిష్ఠం అయ్యే అవకాశం ఉంది.
అభివృద్ధికి ఆద్యుడైనా సంకీర్ణాల బందీ నితీశ్: సంకీర్ణ రాజకీయాలకు నితీశ్ కుమార్ పెట్టింది పేరు. ఎంతలా అంటే “ఎవరు నితీశ్‌తో ఉంటారో.. వారే గెలుస్తారు” అనే అభిప్రాయాన్ని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బలమైన ముద్ర వేశారు. రాజకీయ చతురతతో తాను ఏ కూటమిలో ఉంటే ఆ కూటమి విజయం సాధించేలా చేయగలిగారు. సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియా ప్రభావంతో నితీశ్ రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో తొలిసారిగా నితీశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తొలుత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సన్నిహిత సహచరుడిగా ఉన్నప్పటికీ.. తర్వాతి కాలంలో వారి మధ్య విభేదాలు వచ్చాయి. 1994లో లాలూ యాదవ్‌కు వ్యతిరేకంగా జార్జ్ ఫెర్నాండెజ్ నాయకత్వంలో సమతా పార్టీని స్థాపించడంలో నితీశ్ కీలక పాత్ర పోషించారు. అనంతరం సమతా పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో నితీశ్ రైల్వే మంత్రిగా పనిచేశారు.
తొలి నుంచి పొత్తులే అతడి ఆయుధం: నితీశ్ కుమార్ రాజకీయ ప్రస్థానాన్ని నిశితంగా పరిశీలిస్తే.. తొలినుంచి పొత్తులే అతడి ఆయుధం. తొలిసారిగా సీఎంగా అయినప్పటి నుంచి నితీశ్ ఏదోఒక పార్టీతో పొత్తుపెట్టుకుంటూనే వస్తున్నారు. 2000 సంవత్సరంలో తొలిసారిగా నితీశ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ మెజారిటీని నిరూపించుకోలేక కేవలం ఏడు రోజులు మాత్రమే పదవిలో కొనసాగారు. అయితే తర్వాతి కాలంలో అనగా 2003లో జనతాదళ్(యునైటెడ్)ను స్థాపించారు. 2005లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మళ్లీ నితీశ్ సీఎం అయ్యారు. ఇక అప్పటినుంచి నితీశ్ కుమార్ వెనుదిరిగి చూడలేదు.
తరచూ పొత్తులు మారిన నితీశ్: బీజేపీతో పొత్తు కారణంగా సీఎం అయిన నితీశ్ తర్వాతి కాలంలో ఆ పార్టీకి దూరం అయ్యారు. 2003లో నరేంద్ర మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నితీశ్ ఎన్డీయే నుంచి నిష్క్రమించారు. 2015లో లాలూ అధినేతగా ఉన్న ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తక్కువ సీట్లు గెలిచినా లాలూ సాయంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఒక ఒరలో రెండు కత్తులు ఒదగవన్నట్లుగా రెండు సంవత్సరాల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్‌ను నితీశ్ దూరం పెట్టారు. మళ్లీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీయే కూటమిలో భాగంగా 2020లో సీఎం అయిన నితీశ్ మళ్లీ బీజేపీకి దూరం అయ్యారు. 2022లో కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని కూటమి సాయంతో సీఎం అయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కన్వీనర్‌గా తన పేరును ప్రకటించకపోవడంతో 2024 జనవరిలో నితీశ్ మళ్లీ ఎన్డీయేలో చేరి ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకున్నారు. అధికారమే లక్ష్యంగా ఇన్నిసార్లు పొత్తులను మార్చినా.. బిహార్ ప్రజలు మాత్రం నితీశ్‌తోనే ఉన్నారు.
సంకీర్ణ యుగంలో మరో ఐదేళ్లు సీఎంగా కొనసాగేనా?: నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం బిహార్ రాజకీయాల్లో.. మరోసారి సంకీర్ణ పాలనకు నాంది అయ్యింది. అయితే ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామిగా బీజేపీ ఆవిర్భవించడంతో ముఖ్యమైన విధాన నిర్ణయాలలో కొత్త సమీకరణాలు కనిపించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. అంచనా వేయడం కష్టం. తాము నమ్మిన సిద్ధాంతం కోసం మోదీ, అమిత్ షా ద్వయం ఎంతకైనా తెగిస్తారనేది నగ్నసత్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో నితీశ్ పాలనా మర్క్.. ఎన్డీయే ప్రభుత్వానికి అతిపెద్ద సవాలు కానుంది. అయితే ఎన్డీయే భాగస్వామిగా నితీశ్ కుమార్ ఐదేళ్లు కొనసాగుతారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

