హైదరాబాద్ (తెలుగుప్రభ) : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న రేషన్ స్మార్ట్ కార్డులపై రాజకీయ వివాదం ముదురుతోంది. స్మార్ట్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటో లేకపోవడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార భద్రతా పథకాలతో పాటు రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారం ఉన్నప్పటికీ, రేషన్ కార్డులపై మోడీ బొమ్మకు చోటు కల్పించకుండా కేవలం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చిత్రాలను ముద్రించడంపై బీజేపీ మండిపడుతోంది. కేంద్రం నుంచి రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం దానిని మిస్‌యూజ్ చేస్తూ తమదే అన్నట్లు ఢంఖా బజాయించుకుంటోందని తీవ్ర విమర్శలు చేస్తోంది. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ నాయకులు సన్నబియ్యం పంపిణీ తమ ఘనత మాత్రమేనని కౌంటర్ ఇస్తున్నారు. కేంద్ర పథకాల ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులకు జారీ చేసే కార్డులపై ప్రధాని మోడీ చిత్రాన్ని ఎందుకు ముద్రించలేదని ప్రశ్నిస్తున్నారు. రేషన్ స్మార్ట్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చిత్రాలను ముద్రించడం ద్వారా ప్రభుత్వ పథకాలను రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు అందించే అధికారిక కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రి చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని అంటున్నారు. కేంద్రం-రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలవుతున్న ఆహార భద్రతా కార్యక్రమాల్లో కేంద్రం అందిస్తున్న సహకారాన్ని విస్మరించి, మొత్తం క్రెడిట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునే ప్రయత్నం చేస్తోందని బీజేపీ విమర్శిస్తోంది.
ఎవరి వాటా ఎంత?
తెలంగాణలో ప్రస్తుతం ఫుడ్ సెక్యూరిటీ కార్డు (ఎఫ్‌ఎస్‌సీ) లబ్ధిదారులకు వ్యక్తికి నెలకు 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ పౌరసరఫరాల శాఖకు సంబంధించిన 2026 ప్రెజెంటేషన్‌లో ఈ 6 కిలోల్లో 5 కిలోలు కేంద్రం, ఒక కిలో రాష్ట్రంగా స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 99.70 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు పేర్కొంది.అంటే సాధారణ ఎఫ్‌ఎస్‌సీ లబ్ధిదారుడి విషయంలో నెలకు అందుతున్న 6 కిలోల్లో కేంద్రం వాటా 5 కిలోలు (83.33 శాతం), రాష్ట్రం అదనపు వాటా 1 కిలో (16.67 శాతం)గా ఉంది.
జాతీయ ఆహార భద్రతా చట్టం..
జాతీయ ఆహార భద్రతా చట్టం ఎన్ఎఫ్‌ఎస్‌ఏ కింద పేదలైన లబ్ధిదారులకు వ్యక్తికి నెలకు 5 కిలోల ఆహారధాన్యం హక్కుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పీఎంజీకేవై కింద ఈ ధాన్యాన్ని ఉచితంగా అందిస్తోంది. 2024 జనవరి 1 నుంచి ఈ ఉచిత ఆహారధాన్యాల పంపిణీని మరో ఐదేళ్లపాటు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. అందువల్ల తెలంగాణలో ఎఫ్‌ఎస్‌సీ లబ్ధిదారుడికి లభిస్తున్న 6 కిలోలలో మొదటి 5 కిలోలు కేంద్ర ఎన్ఎఫ్‌ఎస్‌ఏ,పీఎంజీకేవై వ్యవస్థ ద్వారా వచ్చే హక్కు, అదనంగా తెలంగాణ ప్రభుత్వం మరో కిలోను కలుపుతోంది. రాష్ర్ట ప్రభుత్వ అధికారిక శిక్షణ పత్రంలో కూడా ఇదే విధంగా 5 + 1 కిలోలుగా పేర్కొంది.
రాష్ట్రం అదనంగా ఒక కిలో ..
తెలంగాణ ప్రభుత్వం గతంలోనే పీడీఎస్ ద్వారా వ్యక్తికి 6 కిలోల బియ్యం పంపిణీ చేసే విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు సంబంధించిన సమాచారం ప్రకారం ఎన్ఎఫ్‌ఎస్‌ఏ పథకాల కింద రాష్ట్రంలో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం విడుదల చేస్తున్నారు.2026లో రాష్ట్ర ప్రభుత్వం మరింత మెరుగైన నాణ్యతతో సన్నబియ్యం పంపిణీపై దృష్టి పెట్టింది. ఏప్రిల్ 2026 నుంచి ఎఫ్‌ఎస్‌సీ కుటుంబాలకు వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. కేంద్రం ఆహారధాన్యాల సేకరణ, ఆహార సబ్సిడీ, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కేటాయింపుల విషయంలో ప్రధాన బాధ్యతను తీసుకుంటుంది. మరోవైపు రాష్ట్రం బియ్యం పంపిణీ వ్యవస్థ, రాష్ట్ర అదనపు కిలో, స్థానిక పరిపాలనా వ్యయాలు తదితర అంశాల్లో బాధ్యత వహిస్తుంది.
నెలకు ఎంత బియ్యం అవసరం?
తెలంగాణ ప్రభుత్వ 2026 పత్రంలో 99.70 లక్షల కార్డులు ఉన్నట్లు పేర్కొంది. అయితే బియ్యం కేటాయింపు కార్డుల సంఖ్య ఆధారంగా కాకుండా వ్యక్తుల సంఖ్య ఆధారంగా ఉంటుంది. ఒక కోటి మంది లబ్ధిదారులు ఉన్నారని తీసుకుంటే కేంద్రం 1 కోటి మందికి 5 కిలోలకు గానూ 5 లక్షల మెట్రిక్ టన్నులు నెలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రం 1 కోటి మందికి 1 కిలో చొప్పున లెక్కిస్తే 1 లక్ష మెట్రిక్ టన్నులు నెల ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నెలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రేషన్ పంపిణీ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగానే జరుగుతోంది.
రాజకీయ దుమారానికి దారితీసేనా?
రేషన్ స్మార్ట్ కార్డులపై ఫొటోల వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్-బీజేపీ మధ్య మరో రాజకీయ వివాదానికి కారణమవుతోంది. ప్రభుత్వ పథకాల అమలులో కేంద్రం వాటాను ప్రజలకు వివరించాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కార్డుల రూపకల్పనపై తన విధానాన్ని సమర్థించుకునే అవకాశం ఉంది. దీంతో రేషన్ స్మార్ట్ కార్డులపై ప్రధాని మోడీ చిత్రం లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం అంశం రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశముంది.

